తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు. ఆ సమయంలో ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండేవి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలు, అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు.
వీటితో పాటు ఐదు గ్రామాలు సైతం ఏపీ పరిధిలోకి వెళ్లాయి. అయితే, గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి.. గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల గోదావరికి పెద్ద సంఖ్యలో వరదలు పోటెత్తాయి. భద్రాచలం పట్టణం ముంపునకు గురైంది. ఈ క్రమంలో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఏపీకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పట్టణానికి ముంపు లేకుండా ఉండేందుకు ఆయా గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలన్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల పంచాయతీలు తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేసి, ఏపీ ప్రభుత్వానికి పంపాయి.