కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని బలుగాల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని వార్డెన్ కు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం బయట ఎవరికీ తెలియకూడదని సిబ్బంది గేటుకు తాళం వేశారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కొంతమంది పిల్లలు కళ్లు తిరిగి కింద పడిపోగా రూరల్ సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి పోలీసు వాహనాల్లో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. స్వల్ప అస్వస్థతతో మరికొంత మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి పురుగుల అన్నం తిన్నాక ఫుడ్ పాయిజన్ అయ్యిందని స్టూడెంట్స్ చెబుతున్నారు.
మాగనూర్ జడ్పీ హైస్కూల్లోనూ ..
నారాయణపేట్ జిల్లా మాగనూర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లోనూ ఫుడ్ పాయిజన్ జరిగి 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే తలనొప్పి, వాంతులు చేసుకోవడంతో టీచర్లు వారిని మండల కేంద్రంలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. డాక్టర్ లేకపోవడంతో ఏఎన్ఎం వారికి చికిత్స చేశారు. ఉడకని అన్నం, గుడ్డు తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. ఏడుగురు విద్యార్థులు కోలుకోకపోవడంతో వారి తల్లిదండ్రులు దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇదివరకు కూడా ఉడికీ ఉడకని అన్నం, నాణ్యత లేని కూరలు పెట్టారని, ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం వీడడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఆరోపించారు. దీంతో మండల కేంద్రంలోని స్టూడెంట్స్ ఇంటికి వెళ్లి తిని వస్తున్నారన్నారు.
Also Read: మయన్మార్ లో పాఠశాల విద్యార్థులపై కాల్పులు