Saturday, September 21, 2024
HomeTrending Newsఅడవులతో.. రైతుకు రాబడి - అటవీ నిపుణులు

అడవులతో.. రైతుకు రాబడి – అటవీ నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, పర్యావరణ మార్పుల నేపథ్యంలో అటవీ విద్య, పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఏర్పడిందని అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI)లో జరిగిన అటవీ జన్యు వనరుల పరిరక్షణ, నిర్వహణ – మేధో పరమైన హక్కులు (ఐపీఆర్) పై ఒక రోజు జాతీయ సెమినార్ లో దేశవ్యాప్తంగా ప్రముఖ ఫారెస్ట్ కాలేజీలు, సంస్థల తరపున నిపుణులు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ ములుగులో అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తమ అధ్యయనంలో భాగంగా పరిశీలించాల్సిన అంశాలు, పరిశోధనా విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.

ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యత ఉందో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉంటుందని అన్నారు. ముందుచూపు, దార్శనికతతో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అటవీ విద్యను ప్రోత్సహించటం గొప్పవిషయమని, తెలంగాణకు హరితహారం చాలా మంచి కార్యక్రమమని జాతీయ స్థాయి అటవీ నిపుణులు అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు మొక్కలు నాటడం, అడవుల రక్షణకు స్వర్ణయుగంలా ఉందని, దీనిని కొనసాగించాలని అన్నారు.

తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బీ. నీరజా ప్రభాకర్, కర్ణాటక ధార్వాడ్ (సిర్సి) ఫారెస్ట్ కాలేజీ డీన్ డాక్టర్ ఆర్. వాసుదేవ, తమిళనాడు మెట్టుపలాయం ఫారెస్ట్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్. ఏ. బాలసుబ్రమణియన్, కేరళ ఫారెస్ట్ కాలేజీ డీన్ డాక్టర్ ఈ.వీ. అనూప్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐకార్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్. పరిమళన్, హిమాచల్ ప్రదేశ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అభిలాష్ దామోదరన్ లు ఈ సెమినార్ కు హాజరై అడవులు, పర్యావరణం, జీవివైవిధ్యం, సిల్వికల్చర్, టిష్యూకల్చర్, ఫారెస్ట్రీలో మేధోపరమైన హక్కుల ప్రాదాన్యత, తదితర అంశాలపై ప్రసంగిస్తూ, ప్రజంటేషన్ ఇచ్చారు.

అటవీ సంపదను కాపాడటం ఎంత ముఖ్యమో, రైతులు, అడవులపై ఆధారపడి జీవించేవారికి మెరుగైన రాబడి అందేలా కొత్త అటవీ పరిశోధనలు జరగటం అవసరం అని మెట్టుపలాయం అటవీ కళాశాల ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ అన్నారు. సిల్వికల్చర్, టిష్యూకల్చర్ ద్వారా అభివృద్ది పరిచిన కొత్త అటవీ వంగడాలు తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చేలా అభివృద్ది చేశామని అన్నారు. ఒకప్పుడు 45 ఏళ్లకు దిగుబడిని ఇచ్చే టేకు ఇప్పుడు ఇరవై ఏళ్లకు లోబడి, యాభై ఏళ్లకు వచ్చే ఎర్రచందనం ఇప్పుడు 16 సంవత్సరాల్లో పూర్తి స్థాయి చెట్లుగా, ఆదాయంగా మారుతున్నాయని, ఈలోపు అంతర పంటలుగా మిరియాలు, తమలపాకు లాంటి వాణిజ్యపంటల సాగు కూడా రైతులు సాగుచేయవచ్చన్నారు.

అడవులు, పర్యావరణ, జీవవైవిధ్యం పరంగా భారతదేశం చాలా వృద్దిలో ఉందనీ, అటవీ ఉత్పత్తులకు పేటెంట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్, సప్లయ్ పరంగా మరింత అధ్యయనం జరగాల్సి ఉందని కర్ణాటక సిర్సి అటవీ కళాశాల డీన్ డాక్టర్ వాసుదేవ అన్నారు. రిటైర్డ్ పీసీసీఫ్ మనోరంజన్ భాంజా మాట్లాడుతూ ఫారెస్ట్ కాలేజీ విద్యార్థులు దేశంలో ఉన్న విభిన్న మొక్కలు, వృక్ష జాతులు, జంతుజాలంపై అధ్యయనంతో పాటు, పట్టు పెంచుకోవాలని సూచించారు.

తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ దేశంలో వివిధ ప్రముఖ కాలేజీలు, సంస్థల అటవీ నిపుణుల సలహాలు, సూచనలు విద్యార్థులకు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారంలో ఈ సెమినార్ ద్వారా వచ్చిన ప్రతిపాదనలను సమన్వయం చేస్తామని, తెలంగాణ రైతులు సాంప్రదాయ పంటలకు తోడు, మరింత మెరుగైన రాబడిని ఇచ్చే చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు.

కార్యక్రమంలో ఫారెస్ట్ కాలేజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్