పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతలు బాబు నిప్పు అన్నారని, కానీ ఇప్పటివరకూ వ్యవస్థలను మ్యానేజ్ చేసుకున్న బాబు పాపం ఇప్పుడు పండిందని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి అని, ఈ విషయం విచారణ తర్వాత రుజువు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఐటి బాబుకు నోటీసులు ఇస్తే బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నోరు మెదపలేదని, సిఐడి కేసులో మాత్రం మరిదికి వత్తాసు పలికారని విమర్శించారు.
బాబు అరెస్టు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చేసినంత హడావిడి టిడిపి కార్యకర్తలు, సొంత కొడుకు నారా లోకేష్ కూడా కూడా చేయలేదని అనిల్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడే అనే విషయం మరోసారి తేలిందని, కుటుంబ సభ్యుడు కాకపోయినా, తన పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసినట్లు నానా యాగీ చేశాడని విస్మయం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఒక పార్టీ అధ్యకుడ్ని అరెస్టు చేస్తే మరో పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకు రావడం ఇదేనన్నారు. నిన్నటి చంద్రబాబు అరెస్టు తర్వాత టిడిపి పూర్తిగా నిర్వీర్యమైందని, ఒక్క కార్యకర్త కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు.