వైఎస్సార్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. అలాంటి ప్రసక్తే లేదని, ఐదున్నరేళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే.. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే నియాకు లొంగలేదని, అలాంటిది ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తగ్గుతాడా? అంటూ ప్రశ్నించారు. మళ్లీ CM అయ్యే వరకూ తాడేపల్లిలోనే ఉండి రాజకీయ కార్యక్రమాలు చేస్తారని, ‘మీకు చేతనైంది చేసుకోండి. జగన్ తగ్గడు’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.
జగన్ సెక్యూరిటీపై కూడా చంద్రబాబు, లోకేష్‌లు నడుపుతున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. ప్రతిరోజూ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తమ అనుకూల మీడియాతో విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలనుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫేక్ న్యూస్‌ను సృష్టిస్తున్నారు. చంద్రబాబుకు ఎంతమందితో సెక్యూరిటీ ఇస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయనతోపాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేదా? దేవాన్ష్‌కు నలుగురితో సెక్యూరిటీ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవ్వరూ ప్రశ్నించలేదని నాని చెప్పారు.
తాడేపల్లిలోని జగన్ నివాసం మీదా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫొటోలు విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్ నివాసంలో ఏమున్నాయో? మీ నివాసంలో ఏమున్నాయో? నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని నిలదీశారు. సాక్షి సహా మీడియా వారందరికీ జూబ్లీ హిల్స్‌లో మీ ఇల్లు చూపించగలరా అని ప్రశ్నించారు.
పార్టీ ఆఫీసులకు స్ధలాలు ఇవ్వాలని జీవో ఇచ్చింది చంద్రబాబేనని గుర్తుచేశారు. 33 ఏళ్ల లీజు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, 99 ఏళ్లు లీజుకు పెంచుకున్నారన్నారు. టీడీపీ కట్టుకున్న ఆఫీసులు పూరిపాకలు, గుడిసెలు కాదుకదా? అని ఎద్దేవా చేశారు. మీలా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చుకున్న వారితో మేం ఆఫీసులు కట్టించుకోలేదని, పార్టీ డబ్బుతో కట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను… ఇదే రామోజీరావు కుమారుడు తన పత్రికలో రాయగలరా? అని నిలదీశారు.