పాకిస్తాన్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారిక రహస్యాలను బయటపెట్టిన సైఫర్ కేసులో పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్‌తోపాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీకి కూడా 10 ఏళ్లు శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
2022లో ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్రపన్నిందని ఆరోపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని విమర్శలు గుప్పించారు. ఇందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను ఆ ర్యాలీలో ప్రదర్శించారు. అమెరికాలోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు తెలిపారు.
దీంతో అధికారిక దౌత్య సమాచారానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేశ రహస్య చట్టాలను ఉల్లంఘించారని ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఇద్దరిని దోషులుగా తేల్చింది.
తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్(PTI) ధ్రువీకరించింది. ఇది బూటకపు కేసని, ఉన్నత న్యాయస్థానంలో తీర్పును సవాలు చేస్తామని పేర్కొంది. పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలు జరగడానికి వారం రోజుల ముందు వెలువడిన ఈ తీర్పు సంచలనం సృష్టిస్తోంది.
పాక్ మిలిటరీ ఉన్నతాధికారులు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(PPP), పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)(PML) పార్టీలు కలిసి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇమ్రాన్ ను శాశ్వతంగా ఎన్నికలకు దూరం చేయాలనే లక్ష్యంగా ఏడాది కాలంగా పై మూడు వర్గాలు రాజకీయంగా పావులు కదుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉండగా పాకిస్తాన్ లో ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకోవటం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తిరుగుబాటుదారుల కదలికలు… ఖైభర్ పఖ్తుంఖ్వ, పంజాబ్ రాష్ట్రాల్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP) హింసాత్మక దాడులు ప్రభుత్వాలకు, మిలిటరీకి సవాల్ గా మారింది.
గత పది రోజుల నుంచి బలూచిస్తాన్ రాష్ట్రంలో ఇరాన్ సరిహద్దుల వద్ద రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధం, రెండు దేశాల పౌరుల కాల్చివేత తీవ్ర స్థాయిలో ఉద్రికతకు దారితీస్తోంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ళ జైలు శిక్ష సంచలనం రేపుతున్నాయి. దేశంలో ద్రవ్యోల్భణం నింగిని తాకుతుంటే పట్టించుకున్న నాథుడు లేడు. చమురు, నిత్యావసర వస్తువుల ధరల ధాటికి సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.
దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల పాక్ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల ద్వారా పౌర ప్రభుత్వం ఏర్పడకపోతే పాకిస్థాన్ అంతర్యుద్దం దిశగా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కరలేదని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.
-దేశవేని భాస్కర్