జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇక దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు స్విమ్మింగ్‌పూల్‌ను తలపిస్తున్నది. గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వానతో విమానాశ్రయంలో పెద్దఎత్తున నీరు చేరింది. రన్‌వేలను వరద నీరు ముంచెత్తింది. దీంతో అధికారులు విమాన సర్వీసులను రద్దుచేశారు. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వచ్చే విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు.
భారీగా వర్షం కురుస్తుండటంతో వేలాది మంది విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఇక టేకాఫ్ అవడానికి సిద్ధమైన లుఫ్తాన్సా విమానంలో ఒక్కసారిగా వచ్చిన వరదతో నిలిచిపోయింది. దీంతో కొన్నిగంటల పాటు ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు. నగరంలోని రోడ్లన్నీ నీట మునగడంతో వాహనదారుల తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మళ్లిస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని లోకల్ వెదర్ సర్వీస్ విభాగం వెల్లడించింది. స్వల్ప వ్యవధిలోనే చదరపు మీటర్‌కు 25 నుంచి 40 లీటర్ల వర్షం కురుస్తుందని తెలిపింది.