ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్నజస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ గోస్వామి మాట్లాడుతూ లీగల్ ప్రొపెషన్ క్లిష్టమైన, పలు సవాళ్ళతో కూడిన వృత్తి అని పేర్కొన్నారు. కృషి, పట్టుదలకు మించిన ప్రత్యామ్నయం మరొకటి లేదన్న విషయాన్ని యువ న్యాయవాదులంతా గమనించాలని హితవు పలికారు. సామాజిక న్యాయం భావాలను పూర్తిగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. గత ఏడాదిన్నరగా కోవిడ్ దృష్ట్యా వర్చువల్ విధానంలో కోర్టులు పనిచేస్తూ ప్రజలకు తగిన న్యాయ సేవలు అందించాయని గుర్తు చేశారు. ఈ ప్రక్రియలో తోడ్పడిన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ జస్టిస్ గోస్వామి అభినందనలు తెలిపారు. ఏపి హైకోర్టులో పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. తనకు సహకరించిన సహచర న్యాయమూర్తులు సహా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యనాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్, ఏపి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జానకీ రామిరెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గంటా రామారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.