ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో వచ్చే ఏడాది నుంచి సినిమా అవార్డులు ఇస్తామని బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు.
నంది అవార్డుల స్థానంలో కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.
సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టాడని సిఎం అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని సిఎం చెప్పారు.
గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్న సిఎం కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.
కుల జాడ్యం పట్టుకున్న సిని రంగంలో గద్దర్ పేరుతో సినిమా ఆవార్డులు అంటే కొంత విచిత్రపడేవారు ఉన్నారు. వ్యతిరేకించే సాహసం చేయకపోయినా.. నీరుగార్చే ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ సమాజం నుంచి వచ్చే తీవ్ర దూషణలకు సిద్దం కావలిసిందే.
సిఎం పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి తన మార్క్ చూపెడుతున్న రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి ప్రజల మనసు చూరగొన్నారు. సిఎం ప్రకటనపై పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
రాజకీయంగా గద్దర్ నిర్ణయాలు అన్నీ సమర్థించేవి కాకపోయినా… శ్రమ జీవుల గొంతుకగా గళం విప్పిన ప్రజా గాయకుడిగా తెలంగాణ సమాజంలో గద్దర్( గుమ్మడి విఠల్) స్థానం ప్రజల గుండెల్లో చెరపలేనిది… చెరిగిపోనిది.
-దేశవేని భాస్కర్