Saturday, January 18, 2025
Homeసినిమాప్రజా గాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం "ఉక్కు సత్యాగ్రహం’

ప్రజా గాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం “ఉక్కు సత్యాగ్రహం’

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘ అమ్మా! తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. ‘మా భూమి’ సినిమాలో ‘బండి వెనక బండికట్టి’ పాటతో వెండితెరపై కనిపించారు.

తాజాగా మరో సినిమాలో కూడా గద్దర్ నటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను  నిరసిస్తూ…. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఉక్కు సత్యాగ్రహం’లో  గద్దర్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పాటలు కూడా రాశారు. గద్దర్ మరణవార్త తెల్సుకున్న ఈ చిత్ర బృందం ఆయనకు నివాళులర్పించింది.

సత్యారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ గారు చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ చేశారు. ఆయన నటించిన చివరి చిత్రం ఇదే! ఇటీవల రీ రికార్డింగ్‌ పనుల్లో పాల్గొన్నారు. ఆయన మరణించడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా టీమ్‌ అందరి తరఫున కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో  పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతోంది. వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్‌ ప్లాంట్‌ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్‌, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్‌, కేయస్‌ఎన్‌ రావ్‌, మీరా, పల్నాడు  శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావ్‌, బాబాన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు.

గతంలో స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం జరిగిన పోరాటం, ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్టీల్‌ ప్లాంట్‌  యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, నిర్వాసితులు ఈ చిత్రంలో నటించటం ఒక విశేషం. రియాలిటీకి దగ్గరగా యువతరాన్ని ఆలోచింప చేేస విధంగా ఈ చిత్రం ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, సత్యారెడ్డి, మజ్జి దేవిశ్రీ చక్కని పాటలు రాశారు. డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. రీ-రికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్