Curiosity: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ముందుగా కొన్ని ప్రాంతాలలో ప్రివ్యూ ప్రదర్శించారు. అన్నిచోట్ల కిరాక్ పుట్టించేలా వుందని యువత మెచ్చుకోవడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ వివరాలను తెలియజేస్తూ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ “టైటిల్‌ల్లోనే కొత్తదనం వుంది. క్యూరియాసిటీతో కథ మొదలవుతుంది. థ్రిల్లర్ ఫీల్‌ను ఫ్యామిలీ డ్రామా చొప్పించి కామెడీ, యాక్షన్ అంశాలన్నీ మిళితం కావడంతో చూసిన వారికి బాగా నచ్చుతుంది. మా సినిమాకు సురేష్ కొండేటి గారు మొదటి ప్రేక్షకుడు. ఆయనకు నచ్చి సినిమా తీసుకున్నారు. అది మాకు చాలా ప్లస్ అయింది. దర్శకుడు అప్సర్ కథను చాలా కాలంగా రాసుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ కావడంతో కథ చాలా కొత్తగా ఫీలవుతారు. జూలై 8న సినిమా చూసి ఆనందించండి” అని తెలిపారు.