Sunday, January 19, 2025
Homeసినిమాసత్యమే సందేశం

సత్యమే సందేశం

Lage Raho Munna Bhai: Captures Gandhiji message about the Power of Truth & Humanism – Gandhigiri

మున్నాభాయ్ ఎంబీబీఎస్ తీస్తున్న రోజుల్లో “మున్నా మీట్స్ మహాత్మా” అనే‌ సీక్వెల్ తీద్దామని రాజ్ కుమార్ హీరాణీ & విధూ వినోద్ చోప్రా అనుకుని, మాట్లాడుకుంటుంటే ఓ స్పాట్ బాయ్ “సర్ మున్నా అంటే సంజబాబా; మరి మహాత్మా అంటే సంజూబాబా డబుల్ ఆక్షనా..?” అని ‌అడిగాడట. ఆ ప్రశ్న విన్న వీళ్లిద్దరికీ మతిపోయిందట. జాతి మొత్తానికీ జాతిపిత అంటే తెలియదనే విషయం తెలిసివచ్చింది.

తర్వాత గాంధీజీ గురించి సినిమా కోసం సమాచారం సేకరిస్తుంటే, ఆయన ఇచ్చిన ఒక ఆటోగ్రాఫ్ మీద ఎంకే గాంధీ, ది ట్వల్త్ బ్యాట్స్మన్ అంటూ రాసిన దాన్ని చూసిన హిరాణీకి ఆయనలోని హాస్యచతురత మీద ఓ అవగాహన ‌వచ్చిందట. గాంధీజీ చెప్పిన విలువల్ని హాస్యస్ఫోరకంగా కూడా చూయించవచ్చన్న ధైర్యం కలిగిందట.

ఆర్కే నారాయణన్ ‌సుప్రసిద్ధ నవల గైడ్ ని అదే పేరుతో ‌దేవానంద్ సినిమా తీసిన విషయం అందరికీ తెలిసిందే..!

దారితప్పిన ఓ ‌రికామీ కుర్రవాడు ఓ వివాహిత ప్రేమలో పడి, వాడి‌ బతుకంతా మారిపోయి, ముప్పొద్దులా ఆ ‌స్త్రీ గురించి ఆలోచించడం మొదలెట్టి, అబద్ధాలతో ఆమె సాన్నిహిత్యం సాధించిన తర్వాత, ఆమెకు తన నిజస్వరూపం తెలిసి, అసహ్యించుకుని పక్కనబెడితే…,

వాడు ‌తన తప్పు తెలుసుకుని పక్కనే ఉన్న ఊరికి వెళ్లి బతుకుతుంటే, అక్కడి ప్రజలు వాణ్ణి ఓ స్వామీజీ గా ‌భ్రమించి నెత్తికెత్తుకుంటే, ఆ మాయలో ‌వాడు బ్రతికి, చావడం కథ.

లగేరహోలో‌ ‌ఈ ఛాయలు చాలా‌ ఉంటాయి. మున్నా, సర్కీట్ లు లోకల్ గూండాలు. సెటిల్మెంట్ గ్యాంగు‌. మున్నా కి ఆర్జే జాన్వీ గొంతు ఇష్టం. తనని కలవడం కోసం గాంధీజీ క్విజ్ లో మాయోపాయంతో గెలిచి, ప్రొఫెసర్ని అని తన గురించి అబద్ధాలు చెప్పి, తన స్నేహం నిలుపుకోవడం కోసం గాంధీజీ గురించి ఏకధాటిన చదివి తన మైకంలో కూరుకుపోయి, గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం, ఆ అమ్మాయికి నిజం చెప్పి, గాంధీజీ ‌సిద్ధాంతాలైన సత్యం, అహింసల కోసం చివరిదాకా నిలబడటమే కథ.

ఈ కథ క్లైమాక్స్ లో జ్యోతిష్యాల మీద బటుక్ మహరాజ్ ని విమర్శిస్తూ మున్నా అన్న మాటలే, తర్వాత చోప్రా హిరాణీ ద్వయాలకు పీకే సినిమా తీసే ముడిసరుకును అందించాయి.

లక్కీసింగూ, సెకండ్ ఇన్నింగ్స్ హోం, జాన్వీ ప్రేమా పైకి కనిపిస్తున్నా ఈ ‌సినిమా నిజమైన హీరో గాంధీజీయే..! గాంధీగారి మూలసిద్ధాంతాలైన సత్యం; అహింసల గురించి ‌ఇంత కమర్షియల్ గా చెప్పగలగడం అనేది ఒక అతి గొప్ప సినిమా నిర్మాణ పాఠం.

Gandhigiri :

పెద్ద పెద్ద రాజ్యాలూ, గొప్పగొప్ప యోధులూ కలిసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు చిటికెనవేలునైనా కదిలించలేని సమయంలో, ఓ గోచీపాతర కట్టుకున్న, బక్కపలుచని అహింసావాది దాన్ని పునాదులతో సహా ఎలా కదిలించివేయగలిగాడు..‌? తను తిండి మానేసి ఉపవాసానికి కూర్చుంటే, అఖండ భారతదేశమంతా ఎందుకు అమ్మలాగా గగ్గోలెత్తిపోతూ ఏకమైపోయింది..? లాలాలజపతిరాయ్ చనిపోతే, స్థానికంగా విప్లవకారులు కొంతమంది ఆంగ్లేయాధికారులని హత్య చేశారు. కానీ, గాంధీజీ చనిపోతారేమో అన్న భయం యావద్దేశమంతా ఉద్రిక్తతలపాలు ఎలా చేసింది.‌? హింసాయుత ఉద్యమాలు నడిపిన వాళ్లకన్నా,‌ చంపారన్ లో హింస జరిగిందన్న కారణంతో ఉద్యమాన్ని ఆపిన గాంధీజీ గొప్పనాయకుడెలా అయ్యాడు..? ఆయన గుప్పెడు ఉప్పు పిడికిట పట్టి తీసిన మరుక్షణం రాజ్యానికి ఊపిరాడకుండా, నయాపైసా పన్ను రాకుండా ఎలా ఆపింది.‌.?

బందే మే థా దమ్..! వందేమాతరమ్..!!

కారణం ఒక్కటే…!
నిజం..!

నిజం అనేది సాపేక్షం కాదు. అది సంపూర్ణం. అది ‌రాజ్యాలను కబళిస్తుంది. పర్వతాలను కదిలిస్తుంది. హిమాలయాన్ని కరిగిస్తుంది. నిజం అభిప్రాయం కాదు. నిజం దృక్పథం కాదు. అది సార్వజనీనం, సార్వకాలీనం..!

గైడ్ లో రాజు ఐనా; లగేరహోలో మున్నా ఐనా నిజం విలువ తెలిసుకున్నవాళ్లు. నిజం పట్ల వాళ్లకు ఉన్న అంకితభావం విలన్లూ, హీరోయిన్లతో సహా ప్రేక్షకులను కూడా కదిలిస్తుంది. నిజం గొప్పదనం ఆ నాటి పాఠకులకు అర్ధం కావడానికి ఆర్కే నారాయణన్ వర్షం పడగానే గైడ్ లో రాజును ‌చంపేశాడు.

లగేరహో కమర్షియల్ సినిమా. మున్నా చావకూడదు. అలాగే గాంధీజీ‌ నిత్య జీవన సూత్రాలైన సత్యం, అహింసలని ‌బలంగా ప్రేక్షకుల మనసుల్లో ముద్రించాలి. అందుకు కావలసిన ‌సన్నివేశాలన్నీ రెండున్నర సినిమాకోసం రెండున్నర సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా అల్లుకున్నారు.

మున్నాలాంటి ఆరున్నర అడుగుల గూండాని ఒక సెక్యూరిటీ గార్డు చెంపకేసి కొడితే, రెండో చెంప చూపించడం; రెండో చెంప పగిలాక, వాణ్ని తుక్కు రేగగొట్టడం, తరువాత సన్నివేశం గూండాగిరీ కన్నా గాంధీగిరీ ఎంత గొప్పదో నవ్విస్తూ చెప్పడం; వృద్ధుడి పింఛను మంజూరు చేయడానికి లంచమడిగిన ఉద్యోగి ముందు, మున్నా సలహాతో వృద్ధుడి స్వీయ వస్త్రాపహరణం సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నచ్చడం ఈ కథా విస్త్రుతికి అద్దం పడుతుంది.

సినిమా క్లైమాక్స్ లో లక్కీసింగ్ గాంధీజీ గురించి చదువుతుండగా, గాంధీజీ మనతో, నా శరీరాన్ని‌ బుల్లెట్ తో చంపారు కానీ, నా‌ భావనలని చంపలేరంటూ భరతవాక్యం చెబుతాడు.

హిరాణీ, అభిజాత్ జోషీలు సత్యం, అహింసలను ఆయుధాలుగా మార్చుకుంటే, ఎంతటి విలన్లైనా హీరోలవ్వొచ్చనే అత్యంత సీరియస్ విషయాన్ని కామెడీగా చెప్పడం మంచి ఆలోచన.

సూర్యకాంతం గారిని చూడగానే ప్రేక్షకులు గయ్యాళి అని నిర్ధారణకు వచ్చినట్టు, సంజయ్ దత్ ‌ని ‌చూడగానే, వీడు బతికి చెడ్డోడు; చెడి బతికినోడు అనే నిర్ధారణకు ముందే వస్తారు. కాబట్టి తను మున్నా పాత్రధారి కావడం ఓ తెలివైన ‌చర్య.

-గొట్టిముక్కల కమలాకర్

Also Read : తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్న తమిళ హీరోలు, దర్శకులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్