క్రికెట్ టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను బిసిసిఐ నియమించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ‘ఆయనకు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం వేగంగా మారుతున్న మోడ్రన్ క్రికెట్ ను గంభీర్ దగ్గరగా చూశారు. తన కెరీర్లో ఎన్నో విభాగాల్లో రాణించి భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లేలా ఎంతో కృషి చేశారు. ఆయనపై నాకు నమ్మకం ఉంది. గంభీర్ కొత్త ప్రయాణానికి బిసిసిఐ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది’ అని షా ట్వీట్ చేశారు.
గభీర తన కెరీర్ లో ఇండియా తరఫున 58 టెస్టు మ్యాచ్ లు ఆడి 4,154 పరుగులు; 147 వన్డేల్లో 5238; 37 టి 20 మ్యాచ్ ల్లో 932 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్; కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్, 2012లో అతని కెప్టెన్సీలోనే కోల్ కతా తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెల్చుకుంది. 2014 లో మరోసారి కోల్ కతా విజేతగా నిలవడంలోనూ గంభీన్ నాయకత్వ లక్షణాలే దోహదం చేశాయి. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే ఇటీవలి ఎన్నికల పోటీ నుంచి స్వచ్చందంగా ఆయన తప్పుకున్నారు. క్రికెట్ కు పూర్తి సమయాన్ని కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో గంభీర్ చెప్పాడు.
రాహుల్ ద్రావిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడుతున్నారు.