Geeta Gopinath :
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ముఖ్య ఆర్ధికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్.. IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతున్నట్లు గురువారం ఆ సంస్థ ప్రకటించింది. IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా ఆధ్వర్యంలో పనిచేస్తున్న జియోఫ్రీ ఒకామోటో తర్వాత గోపీనాథ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ఐఎంఎఫ్‌లో నెంబర్ 2గా కొనసాగనున్నారు. జనవరి 21వ తేది నుంచి గీత గోపీనాథ్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
నాయకత్వ పాత్రను పోషించడానికి గోపీనాథ్ సరైన వారని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. కరోనాతో మన సభ్య దేశాలు ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సవాళ్ల స్థాయి, పరిధిని పెంచడానికి గీత చేసిన కృషి ప్రపంచ వ్యాప్తంగా గుర్తించారన్నారు. IMF తదుపరి FDMD కావడానికి గౌరవంగా భావిస్తున్నానని గీత గోపీనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలలో, కఠినమైన ఆర్థిక విశ్లేషణ ,పబ్లిక్ పాలసీలలో IMF చేసిన అత్యంత ముఖ్యమైన పనిని ప్రత్యక్షంగా చూశాను. ఆర్థిక వ్యవస్థలపై, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజల జీవితాలపై మా పని సానుకూల ప్రభావాన్ని చూడటం సంతోషంగా ఉందని గీతాగోపినాథ్ అన్నారు.
మలయాళీ కుటుంబానికి చెందిన గీత గోపీనాథ్ ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేశారు. ఢిల్లీ లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిజి, అమెరికా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తి చేశారు. ఆమె భర్త ఇక్బాల్ సింగ్ ధలివాల్ వీరికి ఒక బాబు సంతానం. అమృతసర్ కు చెందిన ధలివాల్ 1995లో సివిల్ సర్వీసెస్ లో అల్ ఇండియా టాపర్ గా నిలిచారు. కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగం వదిలి అమెరికాలో స్థిరపడిపోయారు.
Also Read : ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్