హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పేరు ఖరారైంది. శ్రీనివాస్ అబర్దిత్వాన్ని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ముఖ్య నేతలకు ముందే తెలియజేసిన అయన నేడు అధికారికంగా ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ ప్రస్తుతం టిఆర్ ఎస్ విద్యార్ధి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలానికి చెందిన శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. విద్యార్ధి దశనుంచే అయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఉస్మానియా యూనివర్సిటీ కి తెలంగాణా రాష్ట్ర సమితి విద్యార్థి (టి.ఆర్.ఎస్.వీ.) విభాగం అధ్యక్షుడిగా కూడా అయన పనిచేశారు.
ఈ వారం చివర్లో హుజురాబాద్ తో పాటు దేశంలో ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాలలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో అభ్యర్ధిని అనుకున్న సమయానికి ముందే అభ్యర్ధిని ఖరారు చేశారు.
దళిత బంధు, బిసి బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాలతో టిఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకు పోతోంది. కేసియార్ ప్రభుత్వం గత ఏడేళ్ళుగా అమలు చేస్తున్న పథకాలతో కూడిన ఓ కరపత్రాన్ని నిన్ననే టిఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గగుల కమలాకర్ లు నేడు హుజురాబాద్ లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.