విశ్వవిఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షాకి పువ్వులంటే ఎంతో ఇష్టం. చెట్లు, లతలూ పూలతో నిండుగా కనిపిస్తే వాటిని చూసి ఆనందించేవారు. కానీ ఆయన పువ్వులను కోసి తన ఇంట్లో ఉంచేవారుకాదు.
ఓమారు షా దగ్గరకు ఓ మిత్రుడొచ్చాడు.
“పువ్వులంటే నీకు మహా ఇష్టం కాదు. వాటిని ప్రేమిస్తావు. కానీ ఇంట్లో ఎక్కడా పూలను అలంకరించవేమిటీ?” అని అడుగుతాడు మిత్రుడు.
ఆ మాటకు షాకు చెడ్డ కోపం వస్తుంది.
“పువ్వులంటే నాకిష్టం. కాదనను. అలాగే పిల్లలన్నా నాకు ఇష్టం. అందుకని పిల్లల మెడ తిప్పి ఇంట్లో గాజు పాత్రలలో పెట్టి ఆనందించడం సబబేనా? నాకిష్టమైనవాటిని నేనలా చేయలేను” అన్నారు బెర్నార్డ్ షా.
ఈ మాటలన్నీ విన్న మిత్రుడు మౌనం వహించాడు.
తన జీవితకాలంలో 60కి పైగా నాటకాలు రాసిన ఐరిష్ నాటక రచయిత, సాహిత్య విమర్శకుడు జార్జ్ బెర్నార్డ్ షా 1856 జూలై 26 న ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించాడు. ఆయన తల్లి లూ సిండా ఎలిజబెత్ గుర్లి షా. తండ్రి జార్జ్ కార్ షా. దారిద్ర్యంతో బాధపడిన బెర్నార్డ్ షా మొదట్లో ఓ మతోద్యోగి అయిన పినతండ్రి దగ్గర చదువుకుంటారు. అనంతరం కొద్దికాలంపాటు ప్రొటెస్టెంట్, కాథలిక్ స్కూళ్ళల్లో చదువుకున్నారు. పదహారేళ్ళు నిండకమునుపే ఓ భూముల ఏజెంట్ కార్యాలయంలో పని చేస్తారు.
చిన్నతనంలో, ఆయన ఐర్లాండ్ నేషనల్ గ్యాలరీని క్రమం తప్పకుండా సందర్శించేవారు. ఆయన 1876లో లండన్‌కు వెళ్లి రచయిత కావాలనుకుని ఆ దిశలో కృషి చేస్తారు. బ్రిటిష్ మ్యూజియం రీడింగ్ రూమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుండేవారు. పుస్తకాలు చదువుతూ తోచినవి రాస్తూ ఉండేవారు. ఆయన రాసిన తొలి నవల “ఇమెచ్యూరిటీ”. ఆయన రాసిన మొదటి అయిదు నవలలను ముద్రించడానికి ఏ ప్రచురణకర్తా ఇష్టపడలేదు.
శాకాహారిగా మారాక సోషలిస్టులతో కలిసి గొప్ప వక్తగా పేరు పొందారు. 1884లో నాటక రచయితగా మారారు. ఆయన రాసిన తొలి నాటకం విడోయర్స్ హౌసెస్. ఈ నాటకానికి విశేష ఆదరణ లభించింది.
ఆయన తననెవరైనా ‘జార్జ్’ అని పిలుస్తే ఇష్టపడేవారు కాదు. బెర్నార్డ్ షా అని పిలవాలని పట్టుబట్టేవారు.
ఆయన నాటకాల సంకలనం “ప్లేస్ ప్లెజెంట్ అండ్ అన్‌ప్లజెంట్” పేరుతో 1898లో వెలువడింది.
1925లో, జార్జ్ బెర్నార్డ్ షా సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అప్పటికి ఆయన వయసు 68 ఏళ్లు. ఆయన 91వ ఏట వరకూ రాస్తూనే ఉన్నారు.
జార్జ్ బెర్నార్డ్ షా ఒక స్వేచ్ఛా ఆలోచనాపరుడు. మహిళల హక్కులు, ఆదాయంపై సమానత్వాన్ని సమర్థించారు.
నోబెల్ బహుమతి, ఆస్కార్ రెండింటినీ గెలుచుకున్న ఏకైక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా.
ఆయన 1950 నవంబర్ 2న తన 94 వ ఏట మరణించారు.
– యామిజాల జగదీశ్
Also Read :