Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకృత్రిమ మేధతో విధ్వంసం

కృత్రిమ మేధతో విధ్వంసం

Boomerang: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది.

“నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు.
“దానికేమి భాగ్యం! అలాగే.

అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” అంది.
సరే అని మనవాడు-
“ఇల్లు శుభ్రం చేయి
నీళ్లు తోడి పెట్టు
కట్టెలు కొట్టు
పొలం దున్ను
ఎడ్లకు మేత పెట్టు
నాకు అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టు
నాకు జోల పాడు” అని విసుగు విరామం లేకుండా పనులు చెబుతూనే ఉన్నాడు. అలుపు సొలుపూ లేకుండా దయ్యం చేస్తూనే ఉంది.

హమ్మయ్య!
అని మొదటిరోజు రాత్రి హాయిగా పడుకున్నాడు. ఇలా రెండు, మూడు రోజులు గడిచాక మనవాడికి చెప్పడానికి పనులు మిగల్లేదు. దయ్యమేమో పని పని అని మీది మీదికి వస్తోంది. పని చెప్పకపోతే దయ్యం మిగేస్తుందన్న భయం, అదృశ్యం అవుతుందన్న ఆందోళన మొదలయ్యింది. ఊళ్లో ప్రఖ్యాత భూత వైద్యుడిని సంప్రదించాడు. అతడు చెవిలో ఒక రహస్యం చెప్పాడు. ఇంటికి రాగానే దయ్యం పని పని అంటూ మీద పడబోయింది. ఒక పొడుగాటి వెంట్రుకను ఇచ్చి “దీన్ని కర్రలా నిటారుగా చేయి” అన్నాడు. ఎంతకూ ఆ వెంట్రుక కర్రలా అవడం లేదు. ఆ రోజు నుండి ఈరోజు వరకు మళ్లీ ఇంకో పని చెప్పే వరకు మధ్యలో దయ్యం చేతికి ఒక వెంట్రుకను ఇస్తుంటాడు. భూతవైద్యుడు చెవిలో చెప్పిన చిట్కా ఇది!

చిన్నప్పుడు ఈ కథను కథలు కథలుగా మా అమ్మ చెప్పేది. అప్పటినుండి ఎలాగయినా ఈ వామాచార, అభిచార హోమాల మంత్రాలు నేర్చుకుని దయ్యాలతో పనులు చేయించుకోవాలని చాలా ఏళ్లు అనుకునేవాడిని. (తాంత్రిక, క్షుద్ర పూజల్లో అభిచార హోమం అంటే ఇంకొకరిని హింసించడనికి క్షుద్ర శక్తులను, క్షుద్ర గణాలను ఆవాహన చేసేవి లేదా ఆహ్వానించేవి). రాముడితో యుద్ధానికి తన శక్తి చాలదని రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు చేయబోయింది నికుంభిలా అభిచార హోమమే. ఆ హోమం పూర్తి అయితే వాడిని గెలవడం రాముడికి కూడా సాధ్యమయ్యేది కాదు.

వీటి మీద మరిన్ని వివరాలు కావాల్సినవారు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి చట్నీస్ ఎదురుగా ఉన్న శ్మశానం గోరీల మధ్య నల్లటి దుప్పటి కప్పుకుని ఎవరి కంటా పడకుండా నిరీక్షించగలరు!

జర్నలిజంలో అర్ధరాత్రుళ్లు నేనే ఒక దయ్యంలా పని చేస్తున్నప్పుడు…నా యజమాని అప్పటికే అనేక అభిచార హోమాలు చేసినవాడై…ప్రాణమున్న మనుషులను బతికి ఉండగానే దయ్యాలుగా చేసి…పని చెబుతున్నాడన్న ఎరుక కలిగి చాలా నిరాశ నిస్పృహలకు లోనయి…జర్నలిజం నుండి బయటికి వచ్చేశా!

ఇప్పుడు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ.ఐ.) దయ్యం అలాగే తయారయ్యేట్లుంది. మన పని బరువు తగ్గించుకోవడానికి యంత్రాలను కనుకున్నాం. ఆ యంత్రాలను కూడా నడిపే ఓపిక లేక యంత్రాలను యంత్రాలే నడుపుకునేలా సాఫ్ట్ వేర్లు తయారు చేసుకున్నాం. చివరికి ఆ సాఫ్ట్ వేర్లను కూడా సాఫ్ట్ వేర్లే రాసి పెట్టే కృత్రిమ మేధ తయారయిన కాలంలో ఉన్నాం.

పాతికేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలకు మనం ఉబ్బి తబ్బిబ్బయ్యాము. ఇప్పుడది శ్రుతి మించి మన కొంప ముంచే దశ వచ్చేసరికి కాలిన చేతులతో లోకం ఆకులు వెతుకుతోంది.

కవితలు, పాటలు రాసే చాట్ బోట్లు ఇప్పుడు బొమ్మలు కూడా వేస్తున్నాయి. కాన్సెప్ట్ చెబితే యానిమేషన్ చిత్రాలను, వీడియోలను ఇచ్చే కృత్రిమ మేధ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ వల్ల జరగబోయే అనర్థాల మీద భయాందోళనలు మొదలయ్యాయి. కృత్రిమ మేధ శ్రుతి మించినప్పుడు ఇలా జరగవచ్చని అనుకుంటున్నారు.

1. డిజిటల్ వేదికల మీద ఉన్న కంటెంట్ ను వాడుకుని కృత్రిమ మేధ మానవ మేధస్సు కంటే వేగంగా కొత్త కంటెంట్ ను తయారు చేయడం బాగానే ఉండవచ్చు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మొదటి కంటెంట్ రచయితల కాపీ రైట్ హక్కులు ఏమయినట్లు? సాంకేతికంగా దీనికి ఆధారం అదే అయినా…ధర్మంగా, న్యాయంగా, హక్కుగా రెమ్యునరేషనో, పరిహారమో అడగగలరా?
2. మనిషి మెదడు తయారు చేసిన కృత్రిమ మెదడు మనిషిని ఓడించడం మానవజాతి వినాశనానికి దారితీయాదా?
3. లక్ష మంది ఉద్యోగుల పనిని ఒక్క కృత్రిమ మేధ చేయగలిగినప్పుడు లక్ష మంది నిరుద్యోగులై వీధినపడి నిలువనీడ లేనివారు కారా? ఇలా ప్రపంచం నిరుద్యోగుల నిలయం అయిపోదా?


4. కృత్రిమ మేధ ఎన్ని విద్యలు ఎంతగా నేర్చినా…చివరికి మానవ మేధ గొప్పదని…దానికి తిరుగులేదని ఇన్నాళ్లుగా అనుకున్నది నిజం కాదని…కృత్రిమ మేధ కాలిగోటికి కూడా మానవ మేధ సమానం కాదని రుజువయ్యాక…మనుషుల మెదడుకు విలువేముంటుంది?
5. మెదడుండే మాట్లాడుతున్నావా? అన్న సామెతను పూర్తిగా రద్దు చేయాల్సిందేనా?
6. ఇకపై మన మెదడు మోకట్లో, కనీసం అరికాల్లో అయినా ఉండదా?
7. ఇప్పటికే మెదడులేని, ఉన్నా వాడని, వాడినా ఉపయోగం లేనివారిని మానసిక వికలాంగులుగా ప్రభుత్వాలు, సమాజాలు సానుభూతితో గుర్తిస్తాయా?
8. డార్విన్ “యోగ్యతమాల సార్థక జీవనం” పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం కొన్ని వందల ఏళ్లు మనం మెదడు వాడకపోతే…దానంతట అది అవసరం, ఉపయోగం లేక శరీరంలో ఒకప్పటి తోకలా ఒక అవయవంగా అంతరించిపోదా? అప్పుడు భూగోళంలో మెదడు లేని మనుషులే ఉంటారా?
9. మెదడు సంబంధ వైద్యులయిన న్యూరో ఫిజిషియన్లు, న్యూరో సర్జన్ల జాతి అంతరించిపోతుందా? లేక కృత్రిమ మెదళ్ల వైద్యం వైపు మళ్లి…మనుగడ సాగించగలుగుతుందా? ఒక వేళ అలా జరిగితే వారిని వైద్యులు అనాలా? సాఫ్ట్ వేర్ టెక్కీలు అనాలా?

సృష్టికి ప్రతి సృష్టి ఎప్పటికయినా వినాశ హేతువే. ఇన్నాళ్లూ మనిషి మెదడు, మనసు, ఆలోచనలు, సృజనాత్మకతకు ప్రత్యామ్న్యాయం లేదు; రాలేదు; రాబోదు అనుకున్నాం. ఇప్పుడు ఉంది; వచ్చింది; వెర్రి వేయితలలతో కృత్రిమ మేధ ఇంకా ఇంకా విస్తరిస్తుంది.

కల్పిత కథలో దయ్యానికి భూత వైద్యుడి చిట్కా అయినా పని చేసింది. ఈ కృత్రిమ మేధ నిజం కథలో దయ్యానికి ఏ చిట్కాలూ పని చేయవు- మనకు మనం అర్పణ కావడం తప్ప!

“మాయమైపోతున్నడమ్మ!మెదడున్నవాడు!!”

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్