స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం ఇది. 1 కోటి 20 లక్షల జెండాలను ప్రభుత్వమే మన తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ఇంటింటికీ ఉచితంగా అందజేసింది. ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో యావత్ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతోంది. ఆగస్టు 8వ తేదీన ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నాం. ఈనెల 22వ తేదీవరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటున్నాం. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిది అని తెలిపారు.
మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు..
1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీలక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలర్పించి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు.
తెలంగాణ వీరులది ఉజ్వలమైన పాత్ర
భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం అని కేసీఆర్ పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా..: సీఎం కేసీఆర్
స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం నుంచి నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలతో తెలంగాణ భయంకరమైన బాధలు అనుభవించిందని చెప్పారు.
కరెంటు కష్టాలకు చరమగీతం..
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. విద్యుత్తురంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని వెల్లడించారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగిందని చెప్పారు.
ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ..
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాదిమంది బిడ్డలు ఫ్లోరైడ్ నిండిన నీళ్లుతాగడంతో బొక్కలు వంకరబోయి నరకయాతన పడ్డారని ఆవేదనవ్యక్తం చేశారు. ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకాలంలో ‘నల్లగొండ నగారా’ పేరుతో తానే స్వయంగా పోరాడానని చెప్పారు. నల్లగొండ బిడ్డల దు:ఖాన్ని వివరిస్తూ ‘చూడు చూడు నల్లగొండ.. గుండెమీద ఫ్లోరైడు బండ’ అనే పాటను కూడా రాశానని వెల్లడించారు.
గుక్కెడు నీళ్లకోసం మైళ్లు నడిచి పడరాని పాట్లు పడ్డ తెలంగాణ, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నదని వెల్లడించారు. మిషన్ భగీరథతో 100 శాతం ఆవాసాలకూ మంచినీరు అందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కొనియాడిందన్నారు. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి తెలిపారు.
నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఖ్యాతి పొందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ది చేకూరుతుంది. ఫించన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్దిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
దళితబంధు పథకానికి రూ. 17,700 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది. తద్వారా మొత్తం 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం స్పష్టం చేశారు.
Also Read : ఏ మేరె వతన్ కే లోగో!