Government Motto Is To Supply Free Power To Farmers For Another 25 Years :
రైతులకు రాబోయే 25 ఏళ్ళపాటు ఉచిత విద్యుత్ ను పగటిపూటే అందించాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. గీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీయీసీఎల్), సెకి రెండు సంస్థలూ ఇస్తోన్న కొటేషన్లను బేరీజు వేసుకున్నప్పుడు సెకి తో ఒప్పందమే ఆమోదయోగ్యంగా ఉంటుందని కమిటీ నిర్ధారించిందని చెప్పారు.
చేంజ్ అఫ్ లా నిబంధన ప్రకారం భవిషత్తులో ప్రభుత్వం టాక్సులు పెంచినప్పుడు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఆ అదనపు భారం వినియోగదారుడి నుంచే వసూలు చేయాలన్న షరతు ఉందని, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన విద్యుత్ ఒప్పందాలన్నీ ఈ నిబంధనకు లోబడే జరిగాయని శ్రీకాంత్ వెల్లడించారు.
మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల విషయమై శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. స్థానికంగా విద్యుత్ కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన ట్రాన్స్మిషన్, సబ్ స్టేషన్, గ్రిడ్ కు అనుసంధానం చేయాల్సిన ఖర్చులు ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని, కానీ సెకి విషయంలో అలాంటి అదనపు భారం ప్రభుత్వంపై ఉండబోదని చెప్పారు. ఇప్పటికే దీనికోసం తొలి విడతగా రాష్ట్రం 2,260.78 కోట్లరూపాయలు దీనికోసం మంజూరు చేసిందని, సెకి విద్యుత్ కొనుగోలు చేస్తే ఈ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు.
వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానం ద్వారా దేశంలోని ఎక్కడినుంచైనా విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చన్నారు. 2431 మెగా వాట్ల సోలార్ విద్యుత్ కోసం మనం సెంట్రల్ గ్రిడ్ పై ఆధారపడాల్సిన అవసరం వస్తోందని, జూన్ 1, 2021న కేంద్ర ఇంధన శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఒక్కో మెగా వాట్ కు మూడున్నర లక్షల రూపాయలు ప్రతినెలా చెల్లించాలని, ఏటా 1,021కోట్లు వ్యయం అవుతోందని శ్రీకాంత్ వివరించారు.
జనవరి 16, 2021న కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో, 25 సంవత్సరాల దీర్ఘ కాలిక ఒప్పందంతో సెకి ద్వారా సోలార్ పవర్ కొనుగోలు చేస్తే ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని పేర్కొందని, అందుకే సెకితో ఒప్పందం చేసుకున్నమన్నారు.
వినియోదదారుడికి, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడమే ప్రభుత్వం ఉద్దేశమని శ్రీకాంత్ వివరించారు.
Must Read : అదానీ కోసమే: సోలార్ విద్యుత్ పై కేశవ్