రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా వెల్లడించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాన్ని కృతికా శుక్లాతో పాటు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన గురించి తెలుసుకుని మీ దగ్గరకు వెళ్లి వివరాలు కనుక్కోవాలని తనను పంపారని దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా కుటుంబ సభ్యులకు వివరించారు..తన ఫోన్ నంబర్ ఇచ్చి, ఏ సమయంలో అయినా తనతో ఫోన్ లో మాట్లాడవచ్చని, కేసుకు సంబంధించి వివరాలు తెలుపవచ్చన్నారు. యువతి మృతి సంఘటన గురించి స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్, ఎస్పీ ఆరా తీశారు. వారి కుటుంబ పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ సభ్యుల అనుమానాలు, అభిప్రాయాలు ఏమిటనే విషయాల పై వివరాలు తెలుసుకున్నామన్నారు. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేయడానికి కేసును దిశ డి.ఎస్.పి పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు కృతికా. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.