National voters Day: దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటరుగా నమోదు ప్రక్రియలో యువత క్రియాశీలపాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు. మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశమందిరంలో జరిగిన కార్యక్రమంలో రాజ్ భవన్ నుండి ఆన్లైన్ వెబ్ నార్ ద్వారా గవర్నర్ పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కార్యక్రమానికి స్వాగతం పలకగా కార్యక్రమంలో పాల్గొన్నఅందరితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఓటర్ల ప్రతిజ్ణ చేయించారు.
ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ వేడుల్లో నేరుగా పాల్గొనలేకపోతున్నానని పేర్కొన్నారు. 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు కాగా 2011 నుండి జనవరి 25తేదీన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు.ఓటురుగా నమోదుకు అర్హత కలిగి ఉన్న వారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు గత దశాబ్ద కాలంగా స్వీప్(SVEEP) (సిస్టమాటిక్ ఓటర్స్ ఎక్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్)కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ఓటర్లను పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
మన రాజ్యాంగం కుల,మతాలు,వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలను కల్పించిందని చెప్పారు .కావున ప్రతి ఒక్కరూ వారి ఓటుహక్కును వినియోగించు కోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజలు వారికి నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు వారి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కుఅని గవర్నర్ బిశ్వభూషణ్ స్పష్టం చేశారు..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వవస్థగా భారతదేశం ఉన్నందుకు మనమంతా గర్వించాల్సిన విషయమని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.భారత ఎన్నికల సంఘం ఓటరుగా పేరు నమోదు ప్రక్రియను మరింత పారదర్శకత,సులభతరం చేసేందుకు అనేక రకాల వినూత్న చర్యలను చేపట్టడం పట్ల గవర్నర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఆధార్ తో పొటో ఓటరు గుర్తింపు కార్డు(EPIC)ను అనుసంధానించడంతో ఓటరుగా పేరు నమోదు ప్రక్రియను సులభతరం చేయడం తోపాటు రెండు సార్లు పేర్లు నమోదు కాకుండా నివారించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు.అదే విధంగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్,ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్,సెంట్రలైజ్డ్ యూనిక్ డేటాబేస్ సిస్టమ్,సువిధ పోర్టల్,సి-విజిల్ మొబైల్ యాప్,పిడబ్ల్యుడి మొబైల్ యాప్,1950 యూనిక్ నంబరుతో కూడిన కాల్ సెంటర్ ఏర్పాటు వంటి పలు వెబ్ బేస్డ్ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.