Tuesday, September 24, 2024
HomeTrending Newsరాష్ట్రపతికి గవర్నర్, సిఎం ఘన స్వాగతం

రాష్ట్రపతికి గవర్నర్, సిఎం ఘన స్వాగతం

శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం పర్యటన ముగించుకొని ఆర్మీ హెలీకాఫ్టర్ లో హకీమ్ పేట చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిలిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసిఆర్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం  త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి స్వాగత వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు రాష్ట్రపతికి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. వారిని సిఎం కెసిఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు.

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది…. కాసేపట్లో సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారీలకు సత్కారం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. రేపు నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం  సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశమవుతారు.

డిసెంబర్‌ 28న  భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని, వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శించి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

డిసెంబర్‌ 29న  షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. సాయంత్రం  శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శిస్తారు.

డిసెంబర్ 30న  ఉదయం  రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తారు.  మధ్యాహ్నం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో  రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్