Monday, January 20, 2025
HomeTrending Newsఅధికారం శాశ్వతం కాదు - గుత్తా..పోచారం

అధికారం శాశ్వతం కాదు – గుత్తా..పోచారం

రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళం జాగ్రత్తగా ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. ప్రభుత్వం – గవర్నర్ మధ్య వివాదం అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఈ రోజు స్పందించారు. మహాత్మా గాంధి వర్ధంతి సందర్భంగా శాసనమండలి, శాసనసభలో జరిగిన కార్యక్రమాల్లో స్పీకర్, మండలి చైర్మెన్ పాల్గొని… మహాత్ముడికి నివాళులు అర్పించారు.

శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. దనికుల ధనాన్ని పేదలకు పెడతాం అనే వ్యాఖ్యలు మాటలకు మాత్రమే పరిమితం కావొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు- అహంకార ధోరణితో ఉండొద్దని గాంధీ అనేవారన్నారు. ప్రభుత్వాలు మారడం కాదు- ప్రజల బతుకులు మారాలని స్పీకర్ స్పష్టం చేశారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాస్తవాలను దాచలేకపోతున్నదని తెలిపారు.

దేశంలోని సమాఖ్య వ్యవస్థ, లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పారు. వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచిబుద్ధి కలగాలని, దేశంలో మతోన్మాద శక్తులు- మరెన్నో రకరకాల సమస్యలు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్‌ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : రాజ్ భవన్ ప్రజా భవన్ గా మారింది: తమిళి సై

RELATED ARTICLES

Most Popular

న్యూస్