#RashtriyaSanskritMahotsav ‘జాతీయ సాంస్కృతిక మహోత్సవం 2022’ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతోన్న ఈ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశంలోని వివిధ నగరాల్లో ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్’ జరుపుతోంది. రాష్ట్రంలోని రాజమండ్రిలో నేటి నుంచి రెండ్రోజులపాటు వేడుకలు నిర్వహిస్తున్నారు.
గవర్నర్ ప్రారంభించిన ఈ ఉత్సవాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సినీ నటుడు మోహన్ బాబు ప్రత్యేకఅతిథి గా పాల్గొన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది కళాకారులతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాసరావు, శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, బిజెపి నేతలు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులు పాల్గొన్నారు.