Governor Sri Harichandan Praised The Telugu Arts Culture :
తెలుగుభాషకు ఎంతో విశిష్టత ఉందని, బారతీయ భాషల్లో తెలుగు తీయనైన భాష అని నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్పారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ కవిత్రయం తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారన్నారని, వారి వారసత్వాన్ని శ్రీనాథుడు, పోతన, అల్లసాని పెద్దన కొనసాగించారని స్మరించుకున్నారు. విజయవాడ ఏ 1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళలు, చేతి వృత్తులు, హస్త కళలు, చిత్ర కళలు రాష్ట్ర సాంస్కృతిక, కళా వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయని, కూచిపూడి నృత్యం మన ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేసిందని గవర్నర్ కొనియాడారు.
ఎందరో మహనీయుల బలిదానాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆ త్యాగమూర్తుల పోరాటం ఫలితంగానే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాష్ట్రం ఏర్పాటు చేశారని గవర్నర్ గుర్తు చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం గర్వకారణమని, అవార్డు కమిటీకి గవర్నర్ అభినందనలు తెలిపారు. ప్రతిభ ఉండి ఇప్పటికీ గుర్తింపుకు నోచుకోని ఎందరినో గుర్తించి వారిని సత్కరించడం ముదావహమని పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో డా. వైఎస్సార్ కు ఓ విశిష్ట చరిత్ర ఉందని, వ్యవసాయ రంగానికి అయన చేసిన సేవలు అమూల్యమైనవని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఎందరో లబ్ధి పొందారని, లక్షలాది మంది నిరుపేదలు ఈ పథకం ద్వారా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందారని, అందుకే అయన పేదల హృదయాల్లో కొలువై ఉన్నారని గవర్నర్ కొనియాడారు.
ఇకపై ప్రతియేటా రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎందరో మహానుభావులు, సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య నేడు గడుపుతున్నందుకు ఆనందంగా ఉందని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా పద్మ అవార్డులు, భారతరత్న పురస్కారంతో వివిధ రంగాల వ్యక్తులను సత్కరిస్తోందని, రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం కూడా ఇలాంటి అవార్డులు ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు.
వైఎస్సార్ పేరు చెబితే నిండైన పంచెకట్టు, వ్యవసాయంమీద మమకారం ప్రతి అడుగులోనూ కల్పిస్తుందని, గ్రామం, పల్లె, రైతులు, వ్యవసాయం మీద అయన అభిమానం గుర్తుకొస్తుందని పేర్కొన్నారు. భూమి మీద ఉంటూ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన వైఎస్ లాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా అయన పేరిట రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఇస్తున్నామని, అలాగే ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం, వారి రాజకీయ పార్టీలను, భావాలను కూడా చూడలేదన్నారు. మనిషిని మనిషిగా చూసే సంస్కృతి పాటించామని, తమతో విభేదించినా మనుషుల్లో మహా మనుషులను చూశామన్నారు. అత్యంత నిస్పాక్షపాతంగా అవార్డులను ఇస్తున్నామన్నారు.
తెలుగుకి, సంస్కృతికి, మన కళలకు, మానవతామూర్తులకు ఇస్తున్న అవార్డులుగా సిఎం జగన్ అభివర్ణించారు.