ప్రజారవాణ వ్యవస్థ బాధ్యతగా భావించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది.
ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలనే ధృడ సంకల్పంతో, ఇందుకు సంబంధించి కార్యాచరణను యుద్దప్రాతిపదికన చేపట్టి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి గవర్నర్ కు పంపింది. సాంకేతిక పరంగా చూస్తే ఇది ‘‘మనీ బిల్లు’’ కావడం చేత కాన్సెంట్ కోసం రాష్ట్ర గవర్నర్ కు ఇప్పటికే పంపించడం జరిగింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ నుంచి ‘‘కాన్సెంట్’’ రావడం తప్పనిసరి. కాగా గత రెండు రోజులుగా రాష్ట్ర గవర్నర్ బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పకుండా కాలయాపన చేస్తున్నది.
గవర్నర్ వైఖరీ చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక ధోరణితో మిగతా బిల్లులను ఆపినట్లే ఆర్టీసి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపి ఇటు ప్రభుత్వాన్ని, అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలనే దురద్దేశ్యం స్పష్టం అవుతున్నది.
ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న గవర్నర్ వైఖరి ఆర్టీసి బిల్లు విషయంలో అనుసరిస్తున్న తాత్సార వైఖరి మరిన్ని బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా వున్న ఆర్టీసి కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం వుంది.