EBC Nestam on 25th: ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం కమిటీ వేసినట్లు తనకు తెలియదని, తానూ మీడియాలోనే చూశానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలతో సిఎస్ మాట్లాడుతున్నారని,  ఉద్యోగుల సమస్యలపై కేబినేట్ లో ఎందుకు చర్చిస్తామని ప్రశ్నించారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సిఎం జగన్ కు, ఉద్యోగులకు మధ్య అగాధాన్ని సృష్టించలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారిస్తే కారిస్తే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు సంయమనం పాటించాలని, ఆదర్శంగా నిలవాల్సిన ఉద్యోగులు సిఎంను అసభ్యపదజాలంతో దూషిస్తే సమస్య పరిష్కారం కాదని హితవు పలికారు. సిఎంను తిడితే హెచ్ఆర్ఏ వస్తుందా అని ప్రశ్నించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ నేడు సమావేశమైనది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని మీడియాకు వివరించారు.

అగ్రవర్ణాల్లోని పేద మహిళలలు ఏటా 15 వేల రూపాయల  ఆర్ధికసాయం అందించే ఈబీసీ నేస్తం పథకాన్ని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 25న ప్రారంభిస్తారని పేర్ని వెల్లడించారు. ఈ పథకం ద్వారా మూడేళ్ళలో లబ్దిదారులు ప్రతి ఒక్కరికీ 45 వేల రూపాయలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తోన్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 7,880 కోట్లు, ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రుల అభివృద్ధికి 3,820 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు కిడాంబి శ్రీకాంత్ కు 5 ఎకరాల స్థలం మంజూరుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కోవిడ్ నియంత్రణ కోసం ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లూ తీసుకోవాలని  సిఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారని,  ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారని మంత్రి తెలిపారు. ఏ దశలోనైనా ఈ ఖర్చులను ర్యాటిఫై చేస్తామని సిఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. 11వ పీఆర్సీని, ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపును కేబినేట్ ఆమోదించిందని నాని తెలిపారు.  కోవిడ్ నియంత్రణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలకింద  జూన్ 30 లోపు ఉద్యోగాలు ఇవ్వడానికి కేబినేట్ అనుమతించింది. ధాన్యం సేకరణలో రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేందుకు వీలుగా 5 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకునేందుకు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు అనుమతి మంజూరు చేసింది.

Also Read : ఆవేశంతో నిర్ణయాలు వద్దు: మంత్రి నాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *