మన తెలుగువాడు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయి, తొలిసారి సొంత గడ్డమీద అడుగు పెడుతున్నవేళ పత్రికల్లో స్వాగత ప్రకటనలు వచ్చాయి. ఇదివరకు ప్రధాన న్యాయమూర్తులైన వారు తొలిసారి సొంత రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఇలాగే స్వాగత ప్రకటనలు వచ్చాయో లేదో తెలియదు. ఒకవేళ ఇదివరకు ఇలాంటి సంప్రదాయం లేకపోయినా- ఇప్పుడిలా కొత్త సంప్రదాయం మొదలు పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.
మనకు అత్యంత ఆప్తులకు సాదర స్వాగతం చెప్పడంలో అభిమానాన్నే చూడాలి. అత్యంత గౌరవ స్థానాల్లో ఉన్నవారికి రాజోపచార, శక్త్యోపచార స్వాగతమే పలకాలి.
ఈనాడు మొదటి పేజీ ప్రకటన పొన్నవరం గ్రామప్రజలు ఇచ్చినట్లుగా వారి పేరుతో ఉంది. ఆంధ్ర జ్యోతి మొదటి పేజీ ప్రకటన ఒకటి సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ ఇచ్చినది. పక్కనున్న రెండో ప్రకటన ఎవరిచ్చినదో పేరు లేదు. సాధారణ మాంసనేత్రాలకు కనపడకుండా పేరుందేమో తెలియదు. అంటే జ్యోతి యాజమాన్యమే ఈ ప్రకటన ఇచ్చినట్లు పాఠకుడు భావిస్తే కాదనే అధికారం జ్యోతికి ఉండదు. ఎవరి ప్రేమాభిమానాలు వారివి.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను నిలువెత్తు తెలుగు సంతకంగా, తెలుగు జాతికే గర్వకారణంగా అభివర్ణిస్తూ వచ్చిన ఈ ప్రకటనల్లో తెలుగు ఎలా ఉంది అన్న విషయానికే పరిమితమవుదాం.
గ్రామస్తులు తప్పు:-
తెలుగు పత్రికాభాషకు ప్రామాణికతను తీసుకొచ్చానని చెప్పుకునే ఈనాడు చాలాకాలం తెలుగు భాషా వికాసం కోసం తెలుగు వెలుగు పేరిట మాసపత్రికను కూడా తీసుకొచ్చింది. ఈమధ్యే తెలుగు వెలుగు ఆగిపోయింది.
గ్రామ-స్థ-లు కలిపితే గ్రామస్థులు అవుతుంది. స్థ అంటే ఉండడం. డు ఏకవచనం- గ్రామస్థుడు. లు బహువచనం- గ్రామస్థులు.
ప్రకటన ప్రచురించడం వరకే పత్రిక పని. అందులో మహాప్రాణాలకు అసలు ప్రాణం-స్థ-పోయి అల్పప్రాణం-స్త-అయితే పత్రికకు బాధ్యత ఉండదు. పోనీ – పొన్నవరం గ్రామస్థులను తప్పుపడదామా అంటే-వారి అభిమానం ముందు మహా ప్రాణం అల్ప ప్రాణమయినా తప్పు పట్టకూడదు.
మరి ఈ అక్షర దోషానికి ఎవరిని విచారించి, ఎవరిని బాధ్యులుగా చేయాలి? నిలువెత్తు తెలుగు సంతకం మెడలో తడబడిన తెలుగు ఒత్తుల హారం వేయడం- ఒకరకంగా తెలుగుజాతిగా మనకు మనమే చేసుకున్న అవమానం.
నిలువెత్తు తెలుగు సంతకం సాక్షిగా-
“గ్రామస్తులు” తప్పుకాదనుకుంటే-
స్తాణువు
స్తానం
స్తానికుడు
స్తాపన
స్తాయి
స్తలం
స్తితి
స్తిరాస్తి
స్తూలం
అని రాసినా ఒప్పే అవుతాయి.
ఎవరిచ్చారో తెలియని జ్యోతి ప్రకటనలో అక్షర దోషాలు లేవు కానీ-నిలువెత్తు తెలుగు సంతకం మాటతో ప్రారంభించి-మధ్యలో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం అని తెలుగులో చెప్పకుండా-సుప్రీం కోర్టు అని ఇంగ్లీషు మాటనే పెట్టేశారు.
ఇందులో ప్రధాన న్యాయమూర్తికి కానీ, ప్రకటనలు ప్రచురించిన పత్రికలకు కానీ ఏమీ సంబంధం ఉండకపోవచ్చు. పలచబడుతున్న తెలుగుకు ఇది కూడా ఒక ఉదాహరణ.
తెలుగు ప్రేమికుడయిన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఈ విషయం వెళితే-ఎలా స్పందిస్తారో? ఈమధ్య కేరళ అమ్మాయి ఉత్తరానికి, అమరావతి పిల్లాడి ఉత్తరానికి ఆయన ప్రత్యుత్తరమిచ్చారు.
తెలుగు భాషాభిమానిగా నా బాధ కూడా ఆయన దాకా చేరాలని కోరుకుంటున్నాను.
భావం చూడాలి కానీ-భాషాదోషాలు పట్టించుకోకూడదు అనుకుంటే-నా అజ్ఞానాన్ని పెద్దమనసుతో క్షమించగలరు.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]