రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతిక లోపం తలెత్తడం వల్ల దరఖాస్తులను డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించింది.
గ్రూప్-4 పరిధిలో 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం విదితమే. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తదితర వివరాలకు tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
గ్రూప్-4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అధికంగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు ఉన్నాయి.