Sunday, January 19, 2025
HomeTrending NewsGroup-1 Prelims: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

Group-1 Prelims: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లా కేంద్రాల్లో 994 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి పావు గంట ముందే ఎగ్జామ్‌ సెంటర్ల గేట్లు మూసివేశారు. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని తిరిగి పంపించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుచేశారు.

తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదుచేశారు. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ ట్యాబ్ లు పనిచేయలేదు. సగానికిపైగా అభ్యర్థుల థంబ్స్‌ను ట్యాబ్ తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు పరీక్షకు సమయం దగ్గరపడుతుండటం మరోవైపు థంబ్ అటెండెన్స్ లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. అలాగే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేశారు.

గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్