పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరిగి యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆలోచనతోనే తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పారిశ్రామిక,పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. యజమానులు ఎవరనే కోణంలోనో, రాజకీయంగానో తాము పరిశ్రమలను ఎప్పుడూ చూడలేదని అన్నారు. తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై ఇష్టానుసారం మాట్లాడుతున్న, తన పార్టీ నేతలతో మాట్లాడిస్తున్న చంద్రబాబు తన హెరిటేజ్ కంపెనీని ఇక్కడే కొనసాగిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. హెరిటేజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఒకవేళ రాజకీయ కారణాలతోనే చూసుకుంటే ఆ సంస్థ రాష్ట్రంలో ఉండకూడదు కదా అంటూ నిలదీశారు.
ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై తెలుగుదేశం, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాబోయే పదేళ్ళలో అమర్ రాజా సంస్థ తెలంగాణలో 9500కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే… మొత్తం పరిశ్రమ ఇక్కడి నుంచి తరలి వెళ్ళినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. అమర్ రాజా సంస్థకు సంబంధించి ఏ ఒక్కరైనా తాము ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా తెలంగాణకు తరలిస్తున్నామని చెప్పారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజా సంస్థ ఒక్క ఏపీలోనే పరిశ్రమ ఏర్పాటు చేయాని, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఉండకూడదన్న నిబంధన ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తమపై కథనాలు రాసిన పత్రికలు, వాటికి సంబంధించిన కంపెనీలు రాష్ట్రంలో నడుస్తున్నాయని, తాము నిజంగా కక్ష పూరితంగా వ్యవహరించి ఉంటే అవి ఇక్కడ ఉండలేవని అన్నారు.
మొన్నటి వరకూ తనను గెలిపించాకపోతే ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రానికే చివరి ఎన్నికలంటూ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. తన వల్లే దేశంలో ఐటి వచ్చింది కాబట్టి ఐటి ఉద్యోగులంతా తనకు రాయల్టీ ఇవ్వాలని బాబు అడగడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.