Sunday, January 19, 2025
HomeTrending Newsగుజరాత్ లో పటిదార్ ఓట్ల కోసం పార్టీల పాట్లు

గుజరాత్ లో పటిదార్ ఓట్ల కోసం పార్టీల పాట్లు

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ దఫా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. చాలా చోట్ల బిజెపి – ఆప్ పార్టీల ఆరోపణలు… ప్రత్యారోపణలతో ప్ర‌చార ప‌ర్వం వేడెక్కింది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్‌కు చేర‌డంతో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో 22 శాతం ఉన్న పతిదార్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పటిదార్ల మద్దతు కలిగిన బిజెపి…రిజర్వేషన్ల అంశంలో విఫలమైంది. దీంతో ఇప్పుడు పటేల్ వర్గానికి 40 సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ కూడా 42 సీట్లు పతిదార్లకు కేటాయించగా ఆప్ ఏకంగా 46 సీట్లు ఇచ్చింది. అందులో సింహ భాగం పటిదార్ ఉద్యమంలో పాల్గొన్న వారికే ఆప్ టికెట్లు ఇచ్చింది.  త‌మ‌కు రాజ‌కీయాలు చేత‌కాద‌ని, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డ‌మే త‌మ‌కు తెలుస‌ని ఆప్ సీఎం అభ్య‌ర్ధి ఇసుద‌న్ గ‌ధ్వి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీప్ అర‌వింద్ కేజ్రీవాల్ ప‌ట్ల గుజ‌రాతీల్లో ఆశ‌లు మొల‌కెత్తాయ‌ని, తాను ఆయ‌న ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప‌చేస్తాన‌ని చెప్పారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో రైతుల స‌మ‌స్య‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, అభివృద్ధి రాజ‌కీయాలు, ఉద్యోగుల అవుట్‌సోర్సింగ్ వంటి అంశాలు ప్ర‌ధానంగా ముందుకొచ్చాయ‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల రేసులో కాంగ్రెస్ అస‌లు లేనేలేద‌ని పేర్కొన్నారు.

ఆప్ సీఎం అభ్య‌ర్ధి ఇసుద‌న్ గ‌ధ్వి ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ… గుజ‌రాత్‌లో 27 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాషాయ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింద‌ని మండిప‌డ్డారు. పేద‌లకు త‌మ పిల్ల‌లు మెరుగైన విద్య‌ను పొందే హ‌క్కు లేదా అని ప్ర‌శ్నించారు. ఉచిత విద్య‌, ఉచిత వైద్యం తాయిలాలు కాద‌ని తేల్చిచెప్పారు. ఇక గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు డిసెంబ‌ర్ 1, డిసెంబ‌ర్ 5న రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్