Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: గుజరాత్ చివరి ఓవర్ మేజిక్

ఐపీఎల్: గుజరాత్ చివరి ఓవర్ మేజిక్

Thrilling Victory: ఈ ఐపీఎల్ లో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ మరోసారి చివరి బంతికి విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో నేడు జరిగిన మ్యాచ్ లో చివరి బంతిని సిక్సర్ గా మలిచిన రషీద్ ఖాన్ జట్టుకు మరో అద్భుతమైన విజయం అందించాడు. ఈ సీజన్లో నేటితో కలిపి 8 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ ఏడింటిలో విజయం సాధించగా… వీటిలో ఐదింటిలో చివరి ఓవర్లోనే విజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో రాహుల్ తెవాటియా- రషీద్ ఖాన్ లు 59 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ముంబై లోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 26 వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ కేవలం ఐదు పరుగులే చేసి ఔటయ్యాడు. 44  వద్ద రాహుల్ త్రిపాఠి 16 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లూ షమీకే దక్కాయి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ- ఎడెన్ మార్ క్రమ్ లు మూడో వికెట్ కు పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అభిషేక్ శర్మ 42 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి అల్జారి జోసెఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్ చెరో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరగా, మార్ క్రమ్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి యష్ దయాళ్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు.  గుజరాత్ బౌలర్  ఫెర్గ్యుసన్  వేసిన చివరి ఓవర్లో సన్ రైజర్స్ ఆటగాళ్ళు శశాంక్ సింగ్ – మార్కో జెన్సేన్ లు ఏకంగా 25 పరుగులు రాబట్టారు. శశాంక్ 6 బంతుల్లో 3 సిక్సర్లు,1 ఫోర్ తో 25; మార్కో జెన్సేన్ ఐదు బంతుల్లో ఒక సిక్సర్ తో 8 పరుగులతో అజేయంగా నిలవడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమి మూడు; యష్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మొదటి వికెట్ కు 69 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ పాండ్యా 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 38 బంతుల్లో 11 ఫోర్లు, 1  సిక్సర్ తో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ ­10; అభినవ్ మనోహర్ డకౌట్  తో గుజరాత్ కష్టాల్లో పడింది. ఈ దశలో  తెవాటియా-40 (21బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) – రషీద్ ఖాన్-31 (11 బంతులు, 4 సిక్సర్లు) నిలదొక్కుకొని జట్టును గెలిపించారు. 196 పరుగులు అవసరం కాగా చివరి బంతికి కొట్టిన సిక్స్ తో 199 పరుగులు గుజరాత్ సాధించింది, ఈ జట్టు కోల్పోయిన ఐదు వికెట్లూ ఉమ్రాన్ మాలిక్ ఖాతాలోనే పడ్డాయి.

హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: చెన్నై పై పంజాబ్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్