Thursday, November 21, 2024
Homeసినిమాపాత్రలకే వన్నెతెచ్చిన గుమ్మడి

పాత్రలకే వన్నెతెచ్చిన గుమ్మడి

Gummadi Venkateswara Rao :

ఒకప్పుడు సినిమాను ఒక తపస్సులా భావించేవారు .. ఒక యజ్ఞంలా పూర్తిచేసేవారు. ప్రతి సన్నివేశము ఒక పరీక్షనే అన్నట్టుగా తపించేవారు .. శ్రమించేవారు. తెరపై పాత్ర మినహా నటుడు కనిపించకూడదు. కనుముక్కుతీరు బాగుండాలి .. మంచి స్వరంతో పాటు స్పష్టంగా పలకడం తెలిసి ఉండాలి. అలా ఉన్నవారికే అప్పట్లో మొదటి ప్రాధాన్యత ఉండేది. అందువలన నాటకాల నుంచి సినిమాల వైపుకు వెళ్లినవారు ఎక్కువగా ఉండేవారు. అలా స్టేజ్ నాటకాల నుంచి వెండితెర దిశగా అడుగులు వేసిన నటులలో ‘గుమ్మడి వెంకటేశ్వరరావు’ ఒకరుగా కనిపిస్తారు.

గుమ్మడి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా’ రావికంపాడు’ గ్రామంలో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించారు. స్కూల్ రోజుల్లోనే ఆయనకి నాటకాలపై శ్రద్ధ ఏర్పడింది. వయసుతోపాటు నటనపై మక్కువ పెరుగుతూ వచ్చింది. ఆయన కనుముక్కుతీరు .. వాచకం బాగుండటంతో, సినిమాల్లో ప్రయత్నించమని సన్నిహితులు సలహా ఇచ్చారు. దాంతో మద్రాసుకు చేరుకున్న ఆయన, సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఆరంభంలో ఆదరించేవారు లేక అసహనానికి లోనైనా, ఆయన పట్టువీడలేదు .. తనపై తనకిగల నమ్మకం సడలలేదు.

సినిమాలలో నటించాలనే ఆశతో .. ఆశయంతో ఆయన మద్రాసు మహానగరంలో అడుగుపెట్టారు. కానీ కనుచూపుమేరలో పరిస్థితులు ఆయనకి ఆశాజనకంగా అనిపించలేదు. అవకాశాల కోసం తిరగడంలోనే ఆయన తెచ్చుకున్న డబ్బులు కాస్త అయిపోయాయి. ఇంకా ఎంత ఉందని అడిగేవారు లేరు .. తాను అడిగితే ఇచ్చేవారు లేరు. అప్పుడు కూడా ఆయన అధైర్యాన్ని దగ్గరికి రానీయలేదు .. నిరాశను తన నీడను కూడా తాకనీయలేదు. రెండు రోజుల పాటు పస్తులున్న ఆయన, ఆ తరువాత ఉంగరం తాకట్టుపెట్టి ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన మరింత గట్టిగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

1950లో ‘అదృష్టదీపుడు’ అనే సినిమాతో ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత కూడా అంతగా ప్రాధాన్యతలేని పాత్రలను చేసుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు. ఆశించినస్థాయి పాత్రలు రాకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు .. అప్పటికే వివాహమై ఉండటం వలన, ఇక వెనుదిరిగి తన ఊరు వెళ్లిపోదామని అనుకున్నారు. అయితే ఈ లోగా ఎన్టీఆర్ తో ఆయనకి కొంత పరిచయం ఏర్పడింది. అందువలన తన పరిస్థితిని ఆయనకు చెప్పారు. దాంతో ఎన్టీఆర్ తన సొంత సినిమా అయిన ‘పిచ్చి పుల్లయ్య’లో గుమ్మడికి జమీందారు పాత్రను ఇచ్చారు. ఇక ఆ సినిమా నుంచి గుమ్మడి ప్రయాణం ఆగలేదు .. నవరసాల ఆటలు ఆయన ముందు సాగలేదు.

ఎస్వీరంగారావు తరువాత జమీందారు పాత్రలలో అంతటి హుందాగా .. దర్జాగా .. దర్పంగా .. నిండుగా .. నిబ్బరంగా కనిపించింది గుమ్మడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి జమిందారు పాత్రతోనే ఆయన కెరియర్ మలుపుతిరగడం విశేషం. గుమ్మడి రూపం .. వాచకం ఇటు ప్రేక్షకులకు, అటు ఇండస్ట్రీలోనివారికి నచ్చాయి. దాంతో ఈ సినిమా తరువాత గుమ్మడిని వరుస అవకాశాలు వెతుక్కుంటూ రావడం మొదలైంది. పాత్ర ప్రాధాన్యతను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న గుమ్మడి, తన వయసుకి మించిన పాత్రల్లో కనిపించడానికి వెనుకాడలేదు. మంచి వయసులో ఉన్నప్పుడే వయసుమళ్లిన పాత్రల్లో మెప్పించి అందరితో ‘ఔరా!’ అనిపించారు.

సాంఘిక చిత్రాలలోనే కాదు, చారిత్రక .. జానపద .. పౌరాణిక పాత్రల్లోను గుమ్మడి అందంగా ఇమిడిపోగలరనీ, అద్భుతంగా ఒదిగిపోగలరనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఎస్వీ రంగారావు తరువాత ఆ స్థాయి నటుడిగా ఆయనకి గుర్తింపు లభించింది. దశరథుడు .. విశ్వామిత్రుడు .. పరశురాముడు .. దుర్వాసుడు .. జమదగ్ని .. బలరాముడు వంటి పాత్రలలో గుమ్మడిని తప్ప వేరెవరినీ ఊహించుకోలేం. అంతగా ఆ పాత్రలలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. శ్రీమంతుడి పాత్రలలో ఆయన ఎంతటి రాజసాన్ని ఆవిష్కరించేవారో, పేదరికం పేరుకుపోయిన నిస్సహాయుడి పాత్రల్లోను అంతే గొప్పగా మెప్పించేవారు.

ఎన్టీఆర్ రాముడైతే గుమ్మడి దశరథుడిగా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కృష్ణుడైతే ఆయన నందుడిగా మెప్పించారు. ఎన్టీఆర్ కృష్ణదేవరాయలైతే ఆయన తిమ్మరుసుగా మనసులను కదిలించారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ సినిమా గుమ్మడి నటనకు ఒక  గ్రంథం వంటిది. ఆ పాత్ర అసమానమైన ఆయన నటనకు కొలమానం వంటిది. గుమ్మడిపై టైటిల్ ఉండటానికి ఎన్టీరామారావు అంగీకరించడం గొప్ప విషయం. ఆ కథ .. ఆ పాత్ర పైనే కాదు, గుమ్మడి నటనపై కూడా ఆయనకి గల నమ్మకమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.

‘అంతస్తులు’ సినిమాలో రాజా జగన్నాథరావు పాత్రలో .. ‘రాజమకుటం’లో కుటిలుడైన ‘ప్రచండ’ పాత్రలో .. ‘సుడిగుండాలు’లో లాయర్ పాత్రలో గుమ్మడి నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. పాత్రకి బలాన్ని చేకూర్చడంలోను .. సన్నివేశానికి సహజత్వాన్ని తీసుకురావడంలోను ఆయన సిద్ధహస్తుడు. ఇక చాలు అని ఆయన అనుకునేంతవరకూ అవకాశాలు వదల్లేదు .. ఆయన చూపుల వాకిట్లో నుంచి నవరసాలు కదల్లేదు. అందుకు కారణం అసాధారణమైన ఆయన ప్రతిభనే అని చెప్పుకోవాలి.

ఒకప్పుడు అవకాశాల కోసం ఆరాటపడిన గుమ్మడి, దాదాపు 5 దశాబ్దాల పాటు అసమానమైన తన నటనతో ప్రేక్షకులను ప్రభావితం చేశారు. తన బాడీ లాంగ్వేజ్ .. వాయిస్ .. డైలాగ్ డెలివరీ .. కళ్లతోనే హావభావ విన్యాసం చేసే విధానం కారణంగానే 400 సినిమాలకి పైగా చేయగలిగారు. చివరివరకూ నవరసాలను అదిలిస్తూ .. ఆదేశిస్తూ తనదే పై చేయి అనిపించుకున్నారు. తన ప్ర్రతిభకు కొలమానంగా వచ్చిన పద్మశ్రీ .. రఘుపతి వెంకయ్య అవార్డులను అక్కున చేర్చుకున్నారు. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన గుమ్మడి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనను మనసారా ఓ సారి స్మరించుకుందాం.

(జూలై 9, గుమ్మడి జయంతి – ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Must Read : జనం నాడి తెలిసిన అన్నాదురై

RELATED ARTICLES

Most Popular

న్యూస్