టాలీవుడ్ లో దర్శకుడిగా గుణశేఖర్ స్థానం ప్రత్యేకం. ఎంతటి భారీ సినిమాను అయినా .. ఎంతటి భారీ సెట్స్ తో కూడుకున్న కథనైనా సమర్థవంతంగా చివరివరకూ నడిపించగల సమర్థత గుణశేఖర్ సొంతం. కథాకథనాలపై మంచి పట్టు .. బడ్జెట్ పై అవగాహన .. పాత్రల స్వరూప స్వభావాలపై ఆయనకి పూర్తి స్పష్టత ఉంటుంది. ఎంత పెద్ద హిట్ ఇచ్చినా, దాని గురించి అదే పనిగా చెప్పుకోవడం ఆయనకి అలవాటు లేని పని. అసలు తన గురించి తాను చెప్పుకోవడం రాని దర్శకుడు ఆయన.
చారిత్రక .. పౌరాణిక నేపథ్యం కలిగిన కథలను కూడా ఆయన అద్భుతంగా ఆవిష్కరించగలరు. అందుకు సంబంధించిన కాస్ట్యూమ్స్ పై కూడా ఆయనకి మంచి పట్టుంది. బాలలతో తీసిన ‘రామాయణం’ .. ‘రుద్రమదేవి’ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి గుణశేఖర్ ‘భక్త ప్రహ్లాద’ కథను ‘హిరణ్యకశిప’ టైటిల్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. రానా ప్రధానమైన పాత్రగా ఈ సినిమాను నిర్మించడానికి సురేశ్ ప్రొడక్షన్స్ వారు ముందుకువచ్చారు కూడా.
ఈ కథకి భారీ సెట్స్ .. వీఎఫ్ ఎక్స్ అవసరమవుతాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే కోవిడ్ కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. ‘శాకుంతలం’ ప్రాజెక్టుతో గుణశేఖర్ ముందుకు వెళ్లారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన ‘హిరణ్య కశిప’నే చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్టుపై మూడేళ్ల పాటు కసరత్తు చేసి అంతా సెట్ చేసుకుని ఉన్నారు. అందువలన ఈ ప్రాజెక్టునే ఆయన పట్టాలకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.