తెలుగులో ఈ మధ్య కాలంలో భక్తి సినిమాలు రావడం లేదు. అలాగని చెప్పి ఆ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ చూడటానికి ఇష్టపడటం లేదని అనుకుంటే పొరపాటే. కథ భగవంతుడికి సంబంధించినది కాకపోయినా, ఆ కథను నడిపించేది భగవంతుడే అనే విషయం ఆడియన్స్ కి అర్థమైతే చాలు, పొలోమంటూ థియేటర్స్ కి వచ్చేస్తున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాను అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ కోవలో వచ్చిన మరో కథనే ‘హను మాన్’.
ఈ సంక్రాంతికి థియేటర్లకి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది చిన్న సినిమానే. కానీ ట్రైలర్ తోనే ఈ సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. అందుకు కారణం ముఖ్యమైన సన్నివేశాలకు సంబంధించి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ అనే చెప్పాలి. పెద్ద సినిమాల్లోనే నాసిరకం గ్రాఫిక్స్ కనిపిస్తున్న నేపథ్యంలో, ఈ సినిమాలోని గ్రాఫిక్స్ చూసి అంతా షాక్ అయ్యారు. అదే ఫీలింగ్ థియేటర్స్ లో కంటిన్యూ అయ్యేలా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ జరిగే ‘అంజనాద్రి’కి ప్రేక్షకులను తీసుకుని వెళ్లగలిగాడు.
కథలో ఎక్కడ ఎప్పుడు వీ ఎఫ్ ఎక్స్ ను ఉపయోగించాలో అంతే స్థాయిలో ఉపయోగించారు. అది కూడా సహజత్వానికి దగ్గరగా .. చాలా క్వాలిటీతో. అందువలన ప్రేక్షకులు ఆ సన్నివేశాల్లో నుంచి .. కథలో నుంచి బయటికి రాలేకపోయారు. కంటెంట్ పై జరిగిన కసరత్తు కారణంగా ఎవరూ కూడా ఇది చిన్న సినిమా అనుకోరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అలరించే వినోదపరమైన అంశాల సర్దుబాటు పెర్ఫెక్ట్ గా జరగడం వలన, ఈ సినిమా ఇప్పుడు థియేటర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.