All Communities Aim Government :
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో పేద క్రిస్టియన్ మైనార్టీలకు దుస్తులను పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పేద ప్రజలకు పండుగల సందర్భంగా దుస్తులు, భోజనం పెట్టిన పరిస్థితి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పండుగకు పేదలకు ఉచితంగా దుస్తుల పంపిణీ తోపాటు, భోజనాన్ని అందిస్తున్నదని తెలిపారు.
పేద ప్రజలు పండగలు వచ్చినప్పటికి కొత్త బట్టలు కట్టుకొని కడుపునిండా మంచి భోజనం చేసే పరిస్థితి కూడా ఉండేది కాదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ తదితర పండుగలకు ఉచిత దుస్తుల పంపిణీ, భోజనం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భారతదేశం విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు నిలయమని, ఎలాంటి కలహాలు లేకుండా కలిసి మెలిసి జీవించాలన్నదే తమ అభిమతమని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా శాంతి, సామరస్యాలతో ఉండాలని ఆ ఏసుక్రీస్తును ప్రార్థించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని వర్గాలకు అండదండలు అందిస్తామని ఆయన తెలిపారు.
Also Read : సునీల్ డైరెక్షన్ లో కెసిఆర్ రాజకీయం