Bajji bye bye: హర్భజన్ సింగ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు నేడు బజ్జీ ప్రకటించాడు. దాదాపు 23 ఏళ్ళపాటు క్రికెట్ ఆడిన హర్భజన్ స్పిన్ బౌలర్ గా తన త్యేకత చాటుకున్నాడు. తన కెరీర్ లో 103 టెస్టు మ్యాచ్ లు ఆడి 413 వికెట్లు….. 236 వన్డేలు ఆడి 269 వికెట్లు తీసుకున్నాడు. అయితే టీమిండియా తరఫున కేవలం 28 టి20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన హర్భజన్ 25 వికెట్లు రాబట్టాడు.
బౌలర్ గా మాత్రమే కాకుండా పలు కీలక సమయాల్లో తన బ్యాట్ కు కూడా పని చెప్పి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో బజ్జీ తనవంతు పాత్ర పోషించాడు. టీమిండియా తరఫున 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ఐపీఎల్ మొదలైనప్పటినుంచీ సుదీర్ఘ కాలం (2008-17) ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన బజ్జీ 2018, 2019 సీజన్లలో చెన్నై తరఫున ఆడాడు. వ్యక్తిగత కారణాలతో 2020 ఐపీఎల్ సీజన్ లో పాల్గొనలేదు. 2021 లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడాడు. బజ్జీ సారధ్యంలోనే ముంబై ఇండియన్స్ 2011 ఛాంపియన్స్ లీగ్ టి-20 టోర్నీ గెల్చుకుంది. మైదానంలో అవేశపరుడిగా ఉండేవాడు బజ్జీ. ఐపీఎల్ మొదటి సీజన్లో బౌలర్ శ్రీశాంత్ ను చెప్పదెబ్బ కొట్టి వివాదాల్లో ఇరుక్కున్నాడు.
పంజాబ్ రాజకీయాల్లో హర్భజన్ ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది, త్వరలో బజ్జీ కాంగ్రెస్ లో చేరనున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్, పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ పరోక్షంగా వెల్లడించాడు.
తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఇన్నేళ్ళ తన కెరీర్ లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.
Also Read : కబడ్డీ లీగ్; సత్తా చాటిన ఢిల్లీ