తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ఫోర్జరీకి పాల్పడ్డారని, దానిపై కేసు నమోదైందని అందుకే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అయ్యన్న చాలా కాలంగా సిఎం జగన్ మోహన్ రెడ్డిని, పోలీసు వ్యవస్థపై ఎలా మాట్లాడుతున్నారో అందరం చూస్తున్నామమని, అయినా సంయమనం పాటించామని చెప్పారు. ఆయన అరెస్ట్ తో బీసీలకు ఏం సంబంధమని, అరెస్టు ఘటనను బీసీలకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. అపార అనుభవం ఉందని చెప్పుకునే అయ్యన్న పాత్రుడికి ప్రభుత్వ భూమిని ఆక్రమించడం తప్పు అని తెలియదా అని ప్రశ్నించారు. ఆక్రమించిన భూమికి సంబంధించి హైకోర్టుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారని గుర్తు చేశారు. బీసీలకు ఆయనో మహా నాయకుడిగా చిత్రీకరించడం తగదన్నారు.
లోకేష్ కనీస పరిజ్ఞానం లేకుండా అయ్యన్న అరెస్ట్ పై స్పందిస్తున్నారని, రాష్ట్రంలో పులి ఎవరో, పిల్లి ఎవరో అందరికీ తెలుసని ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. బీసీల సంక్షేమం కోసం సిఎం జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, బాబు హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు.
టిడిపి శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, బీసీలకు తీరని అన్యాయంగా పేర్కొనడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయిందని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడడం లేదని, అందుకే వారు ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ఇలాంటి నిరసనలు చేస్తున్నారని బూడి విమర్శించారు.
Also Read : అయ్యన్న పాత్రుడి అరెస్ట్