మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబై నగరంతో పాటు, థానే, పాల్ ఘర్ జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీటితో పాటు నాసిక్, పూణే, రాయ్ ఘడ్, గొండియా, గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలకు కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఎదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఈ రోజు వేకువజాము నుంచే ముంబై మెరైన్ డ్రైవ్ లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ దారిలో వెళ్ళే వాహనాలను, పర్యాటకులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది.
ముంబై మలబార్ హిల్స్ లోని రాజ్ భవన్ పరిసరాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే, కొల్హాపూర్‌లోని పంచగంగనది పొంగిపొర్లుతోంది. నీటిమట్టం హెచ్చరిక మార్కుకు ఏడు అడుగుల వరకు చేరుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు.