రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్కడక్కడ, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం అతి భారీ వర్షాలు కురిశాయి. మెదక్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో ఈ వర్షకాల సీజన్‌లో 20 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీ కాగా, ఇప్పటి వరకు 723.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యమై జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో కురిసిన భారీ వర్షాలతో అధిక వర్షపాతం రికార్డయింది. ఆగస్టులో వర్షాలు ముఖం చాటేయడంతో కరువు తప్పదనుకున్న సమయంలో రుతుపవనాలు పుంజుకోవడంతో సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ వర్షాలు పుంజుకున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు 5.4 మి.మీ సాధారణ వర్షపాతం కురువాల్సి ఉండగా.. మంగళవారం నాటికి 31.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో ఐదు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అన్ని జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.