Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉప్పు ఎక్కువై పుట్టి మునుగుతోంది భాస్కరా!

ఉప్పు ఎక్కువై పుట్టి మునుగుతోంది భాస్కరా!

Salt-Heart-Threat:
“చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా


చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!”

ఎంత చదువు చదివినా…కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు ఎలా అర్థం లేనిదవుతుందో అలాగే నలపాకం కంటే గొప్పగా కూర వండినా…అందులో ఉప్పు పడకపోతే రుచిలేనిదవుతుంది. చదువులో రసజ్ఞతను మనం గాలికొదిలేశాము కానీ…భాస్కరుడు చెప్పిన కూరలో ఉప్పును మాత్రం గట్టిగా పట్టుకున్నాము. ఉప్పు కొండలను ఉఫ్ ఉఫ్ అని ఊదిపారేస్తున్నాము. ఒళ్లంతా ఉప్పుతో నింపేసుకుంటున్నాం.

పద్యాల్లో చాలాసార్లు క్రమాలంకారంలో అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయి. ఎంత చదువున్నా “ఇంచుక(పిసరంత)” రసజ్ఞత అనే క్రమంలో ఎంత నలపాకంతో సమానమైన కూర వండినా అందులో “ఇంచుక(చిటికెడు)” ఉప్పు పడకపోతే రుచి రాదుకదా? అని అన్వయించుకోవాలి. కవిత్వ రచనలో పునరుక్తి ఉండకూడదు. అందువల్ల కూర దగ్గర చిటికెడు అన్న మాట లేకపోయినా పైనున్న పోలిక దగ్గరి మాటనే అరువు తెచ్చుకోవాలి. “ఇంపొదవెడు” ఉప్పు అని అంతటి భాస్కర శతకకారుడు అన్నాడు కదా అని మనం చిటికెడు వేయాల్సిన చోట గుప్పెడు, గుప్పెడు వేయాల్సిన చోట గంపెడు వేస్తున్నాం.

భారత దేశంలో ఉప్పు వాడకం మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ అధ్యయనంలో తేలింది. అందులోను మగవారు మరీ ఎక్కువగా ఉప్పును వాడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబుల్యు హెచ్ ఓ ప్రమాణాల ప్రకారం రోజుకు అయిదు గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. కానీ భారత్ లో పురుషులు సగటున రోజుకు తొమ్మిది గ్రాములు; మహిళలు ఏడు గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. దేశంలో రక్తపోటుతో మరణించేవారి ఆహారపుటలవాట్లను పరిశీలించినప్పుడు- ఒక్క 2016 సంవత్సరంలోనే 16 లక్షల మంది హైపర్ టెన్షన్ తో మరణించారని…వీరందరూ ఉప్పు మోతాదుకు మించి తీసుకున్నవారే. కనీసం 2025 లోపు ఇప్పుడు వాడుతున్న ఉప్పులో ముప్పయ్ శాతం తగ్గించకపోతే…ఉప్పే పెను ముప్పై లక్షలాది మంది ప్రాణాలు ఉఫ్ అని ఊదినట్లు గాలిలో కలిసే ప్రమాదం ఉంది.

ఉప్పు- కారం తినే మనుషులం;
చీము నెత్తురు కలవాళ్లం- అని గొప్పలు చెప్పుకోవడానికి ఇక ఎంతమాత్రం అవకాశం లేదు. ఉప్పు- కారం తెగ తింటున్నవారు అంటే ముప్పును పొట్టలో పేర్చుకుంటున్నవారు అనే అర్థం చేసుకోవాలి- భాస్కరా!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్