Saturday, January 18, 2025
HomeTrending Newsపోటీకి దూరంగా కాంగ్రెస్ సీనియర్లు.. రంగంలోకి వారసులు

పోటీకి దూరంగా కాంగ్రెస్ సీనియర్లు.. రంగంలోకి వారసులు

మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి నేతలు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొత్త మిత్రపక్షాలను కలుపుకుపోతు పాత మిత్రులను దరిచేర్చుకుంటూ ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా కూటమిలో లుకలుకలు. కాంగ్రెస్ అగ్ర నేతలు పోటీ నుంచి తప్పుకొని వారసులను రాజకీయాల్లోకి దింపే పనిలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఛీప్‌ గా ప‌ని చేసిన సోనియా గాంధీ దగ్గరి నుంచి తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి వరకు అందరు వారసులను రాజకీయ ఆరంగేట్రం చేయించే ప్రణాళికలలో బిజీగా ఉన్నారు. వయోభారం, ఆరోగ్య కారణాల రిత్యా రాయ్ బరేలి ఎంపి స్థానం నుంచి తప్పుకొని.. ఇటీవలే రాజ్యసభకు నామినేశాన్ వేశారు. ఈ నియోజకవర్గం నుంచి సోనియా కుమార్తె ప్రియాంక గాంధిని పోటీ చేయించాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

అమేథిలో ఓడిపోయిన రాహుల్ గాంధి వయనాడ్ లో గెలిచారు. అప్పటినుంచి రాహుల్ ఈ ప్రాంతంలో పర్యటించటం తగ్గించారు. దీంతో గాంధీల ప్రాభవం కాపాడేందుకు ప్రియాంకను రంగంలో దింపాలని పార్టీలో చర్చ జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఖ‌ర్గే త‌న అల్లుడు రాధాకృష్ణ‌న్ దొద్ద‌మ‌ణిని గుల్బార్గా నుంచి బ‌రిలో దించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఖ‌ర్గే కుమారుడు ప్రియాంక్ ఖ‌ర్గే క‌ర్ణాట‌క కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్నారు. దీంతో అల్లుడిని బ‌రిలోకి దించాల‌ని ఖ‌ర్గే ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఖర్గే ఇప్పటికే రాజ్యసభ సబ్యునిగా ఉన్నారు. వారసత్వ రాజకీయాలను కప్పిపుచ్చేందుకు…  తను ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కాకూడ‌ద‌ని, దేశ‌మంత‌టా త‌న సేవ‌లు అవ‌స‌రం ఉన్నాయ‌ని ఖ‌ర్గే త‌న అనుచ‌రుల‌తో చెప్పిన‌ట్లు తెలిసింది.

రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్థానంలో తన కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ను జాలోర్‌ స్థానం నుంచి పోటీకీ సీఈసీ ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా గెహ్లాట్‌ సొంత సీటైన జోధ్‌పూర్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్‌ నాథ్‌ తిరిగి అదే స్థానం నుంచి పోటీచేయనున్నారు. కాగా, అనారోగ్య కారణాలతో ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. తనకు బదులుగా కుమారుడు వీరెందర్‌ రావత్‌కు హరిద్వార్‌ టికెట్‌ కేటాయించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

కేరళ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కరుణాకరన్ కుమారుడు త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి ఎంపిగా పోటీ చేయబోతున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ నుంచి ఎంపిగా బరిలో ఉండబోతున్నారు.

తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి శాసనసభ ఎన్నికల బరి నుంచి తప్పుకొని తన కుమారుడు జైవీర్ రెడ్డికి నాగర్జునసాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొన్నారు. ఇప్పుడు మరో కుమారుడు రఘువీర్ రెడ్డికి నల్గొండ ఎంపి టికెట్ దక్కించుకున్నారు.

వీరు కాకుండా ఇప్పటికే ఒకటి, రెండు సార్లు గెలిచి ఎంపిలుగా కొనసాగుతున్న వారిలో అనేకమంది వారసత్వ వైభవం ద్వారా వచ్చిన వారే ఉన్నారు.  మరోవైపు గ్రూపు రాజకీయాలతో విసిగిన రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నారు. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా… తాను ఇన్‌చార్జిగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా పర్యటించడానికి అవకాశం ఉంటుందని ఆయన చెపుతున్నారు.

దేశంలోని ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కొత్తవారి కన్నా వారసులకే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ కారణంతో కూడా ప్రజలు కాంగ్రెస్ ను అంతగా ఆదరించటం లేదనే వాదన ఉంది. అయితే ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. సిద్దాంతాలు, క్రమశిక్షణ పేరు చెప్పుకునే బిజెపిలో కూడా ఇదే ధోరణి మొదలైంది. ప్రాంతీయ పార్టీలు సరేసరి.

పార్టీ భవిష్యత్తు, గెలుపుతో సంబంధం లేకుండా వారసులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ సీనియర్లు పావులు కదుపుతున్నారు. బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే పరోక్షంగా సహకరిస్తున్నాయని చెప్పవచ్చు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్