‘ఇన్మయ్’ అంటే మన దగ్గర ఉండాల్సిన భావోద్వేగమేదో లేకపోవడం. తొమ్మిది భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొమ్మిది భాగాల అంథాలజీ ‘నవరస’. ఇందులో ఇన్మయ్(భయం అనే భావోద్వేగం) అనే భాగాన్ని దర్శకుడు రతింద్రన్ ప్రసాద్ తెరకెక్కించారు. దక్షిణాది ప్రేక్షకులే కాదు, ఉత్తరాది ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకున్న హీరో సిద్ధార్థ్ ఇందులో నటించాడు. తమిళ సినీ ఇండస్ట్రీలోని గొప్ప టాలెంటె్ అంతా ఈ అంథాలజీని రూపొందించడానికి కలిసి వచ్చింది. ఈ అంథాలజీ ఆగస్ట్ 6న నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
ఈ ఆంథాలజీలో భాగమై పనిచేయడంపై సిద్ధార్థ్ మాట్లాడుతూ… ‘‘మణిరత్నం గారు, జయేంద్ర గారు ఇన్మయ్‌లో భాగం కావాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాను, ఎగ్జయిట్ అయ్యాను. మానవ జీవితంలో భాగమైన నవరసాల గురించి చెప్పే ఈ అంథాలజీలో ఇన్మయ్ అంటే ఉండాల్సిన భావోద్వేగమేదో లేకపోవడం అనే అర్థం వస్తుంది. ఈ ఇన్మయ్ అనే దాని ఆధారంగా ఓ భాగాన్ని తెరకెక్కిస్తున్నామని తెలియగానే అందరిలో తెలియని ఓ క్యూరియాసిటీ ఏర్పడింది. ‘నవరస’ అంథాలజీ కొవిడ్ వల్ల ఇబ్బంది పడ్డ సినీ పరిశ్రమలోని వ్యక్తుల కోసం సెలబ్రిటీలందరూ కలిసి ఫండ్ రైజ్ చేయాలని నిర్ణయించుకుని చేసిన ప్రాజెక్ట్. ఇలాంటి ఓ ప్రాజెక్ట్ కోసం మణిరత్నంగారు, జయేంద్రగారు, రతీంద్రన్ ప్రసాద్, పార్వతీ తిరువోతులతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.
ప్రేమ, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భయం, జుగుప్స, ఆశ్చర్యపోవడం, శాంతి అనే తొమ్మిది అంశాలతో రూపొందిన అంథాలజీయే ‘నవరస’. మద్రాస్ టాకీస్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్ బ్యానర్స్ దీన్ని నిర్మించాయి. ‘నవరస’ వెబ్ సిరీస్ 190 దేశాల్లో ఆగస్ట్ 6న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుంది.