తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నత మైనదనీ, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో లభ్యం కావడం మనకు గర్వకారణమని సిఎం అన్నారు. ఈ దిశగా తెలంగాణ చరిత్ర కారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలిపే విధంగా..భారత జాగృతి సంస్థ ప్రచురించిన, తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో.. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా..
ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆవిష్కరించారు.
భారత జాగృతి చరిత్ర విభాగం గత 6 సంవత్సరాలుగా తెలంగాణలోని అనేక చారిత్రక ప్రదేశాలను, చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో పలువురు చరిత్రకారులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి సేకరించిన సమాచారాన్ని, మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో పుస్తకాలకు రూపకల్పన చేశారు.
చరిత్ర రచన కోసం ఆయా ప్రదేశాల లోని శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణాలు, గ్రంథాలు సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసినట్లు వారు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ… దాదాపు 20 కోట్ల సంవత్సరాల పైబడిన చరిత్ర ఆనవాళ్లు తెలంగాణలో లభ్యం కావడం మనకు గర్వకారణం అన్నారు. ఆయా కాలాల లోని కొనసాగిన సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతులు, నాటి దార్శనికత ను అర్థం చేసుకుంటే రేపటికి మనకు దారి చూపుతాయని అన్నారు. మన గత చరిత్రను అర్థం చేసు కోవడం ద్వారా, వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ తద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోగలమని సిఎం తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జాగృతి చరిత్ర విభాగం భాద్యులను, జాగృతి సంస్థ అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితను అభినందించారు. ఈ కార్యక్రమంలో… చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్, కవి సంపాదకులు వేముగంటి మురళీకృష్ణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.