Neem Tree:
“చెట్టునురా -చెలిమినిరా
తరువునురా – తల్లినిరా
నరికివేయబోకురా
కరువు కోరుకోకురా
అమ్మనురా అమ్మకురా
కొడుకువురా కొట్టకురా
నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం
మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం
చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా
దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు
రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా
పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి
కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి
మా పుట్టుక నుండి మీపైనే కద జాలి
సూర్యరశ్మి బువ్వగా లవణాలే పాలుగా
కలిపి ఉగ్గుపాలపిండి తిండి చేసినానురా
కడుపునింపు మాతకు కడుపుకోత పెట్టకు
చనిపోయిన మనుషులకై మమ్ము నరికి చితి పేర్చి తగలేసే నాగరికత మీది
బతుకంటే త్యాగమనే బాధ్యత మాది
మా తనువులు తెంచినా వేళ్ళు భూమిలో మిగుల్చు
మళ్ళీ మీకోసం చిగురించు దారి ఉంచు
పెకలించాలంటే మొదట పది చెట్లను పెంచు”
సుద్దాల అశోక్ తేజ సినిమా పాటల రచయిత కాబట్టి పరిచయం అక్కర్లేదు. అయితే ఈచెట్టు పాడే పాట సినిమాపాట కాదు. సినిమాల్లో వాడలేదు. అయినా, సినిమా ఇంత వాస్తవికతను, సందేశాన్ని సహించదు. సహించాలని కోరుకోకూడదు. దాని మర్యాదలు దానివి.
కొట్టు కొట్టు చెట్టే కొట్టు చెట్టు చెట్టు పట్టే కొట్టు -లాంటి నీచ ప్రాసల పాకులాటలకే సినిమా ఊగిపోతుంది. దాని బలం, బలహీనత అది. ఆ చర్చ మనకనవసరం.
ఇది సుద్దాల ప్రైవేట్ సాంగ్. అక్కడక్కడా ప్రకృతి ప్రేమికులయిన భాషా ప్రేమికుల నోళ్ళలో మాత్రమే నానుతున్న పాట. ఇంకా బాగా ప్రచారం కావాల్సిన పాట.
సరళమయినభాషలో అందరికీ అర్థమయ్యేలా రాశారు కాబట్టి నిజానికి విశ్లేషణ అనవసరం.
చెట్టును, చెలిమిని, తల్లిని. మీరు నా పిల్లలు. నన్ను కొట్టకండి. కొట్టి కట్టెలుగా అమ్మకండి. నేలతల్లి గుండెలో నుండి విత్తనం గొంతుకతో ప్రకృతి సుప్రభాతగీతం పాడుతూ పసిపెదవులతో నేను మోసులెత్తుతాను. కొమ్మలు రెమ్మలు ఊపుతూ నేను పాడే పచ్చనాకు సంగీతం మీకు నచ్చలేదా? రాళ్లతో నన్ను కొట్టినా నా పిల్లలే కదా అనుకుని పళ్ళను ఇస్తున్నాను. పనికి రాని గాలి పీల్చి మీకేమో ప్రాణవాయువునిస్తున్నాను. కాలుష్యాన్ని తగ్గిస్తూ మా పుట్టుకను మీకోసమే త్యాగం చేశాను. ఎండవేడిని తిని, పత్రహరితాన్ని తయారు చేసుకుని, వేరునీరు తాగి మీకు ఫలాలను ఇస్తున్నాను. నేనేమో మీ కడుపు నింపితే, మీరేమో నా కడుపు కోస్తారు. చనిపోయిన వారి చితికి, బతికి ఉన్న మమ్మల్ను చంపే నాగరికత మీది. మీచావు మా చావుకొచ్చినా భరించే త్యాగం మాది. ఒకవేళ మా శరీరాలను తుంచాలనుకుంటే కనీసం వేళ్లనయినా అలా వదిలేయండి. మళ్ళీ మీకోసమే చిగురిస్తాం. ఒక చెట్టును కొట్టాలంటే ముందు పది చెట్లను పెంచండి.
రుద్రంలో వృక్షేభ్యో – హరికేశేభ్యో అని స్పష్టంగా ఒక మాట ఉంది. చెట్టు, చెట్టు కొమ్మల్లో ఆకుల పత్రహరితం – అంతా శివమయం. ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి స్థానం. ఒకే చెట్టులో శివ కేశవులు ఇద్దరూ కొలువయినవి ఉన్నాయి.
చెట్టు లేక పొతే తిండి లేదు, గాలి లేనే లేదు .
మనకేమో చెట్టూ పుట్ట లేకుండా ఫ్రెష్ కూరలు, పళ్లు, ఆకులు, ఫ్రెష్ గాలి కావాలి.
ఎలా వస్తాయో? ఎక్కడినుండి వస్తాయో?
నరికేసిన చెట్టుపాడే ఈ పాటను అడగండి – సమాధానం ఇస్తుందేమో ?
“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక్క వసంతమయినా మిగిలేది- మనిషినై పుట్టి అన్ని వసంతాలు కోల్పోయాను”
అన్నాడు గుంటూరు శేషేంద్ర. రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్యావాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు ఇచ్చి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్ల కొమ్మలచేతులు రాముడు వెళ్ళినవైపు తిప్పి విలపించాయన్నాడు వాల్మీకి.
ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. హైదరాబాద్ పార్సీగుట్ట వీధిలో ఒక వేపచెట్టు ఉండేది. ఇప్పుడు లేదు. 2009-2016 మధ్య ఏడేళ్లపాటు ఆ చెట్టుతో ముడిపడిన అనేకానేక దృశ్యాలను జర్నలిస్టు, రచయిత, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు తన కెమెరాలో బంధించారు. ఒక తల్లికి ఆ వేప చెట్టు దేవత. దేవుడు. తోడు నీడ. సర్వస్వము. దారినపోయే వారందరూ వచ్చి ఆ వేప చెట్టు నీడలో సేద తీరడం ఆ తల్లికి సంతోషం. ఆ తల్లి కూతురికి చికాకు. పాతతరం ఆలోచనలు ఒకలా ఉంటాయి. కొత్త తరం ఆలోచనలు మరోలా ఉంటాయి. ఊళ్లో వాళ్లందరికీ తమ ఇంటి గుమ్మం ఈ వేప చెట్టు వల్ల ఒక అడ్డా అయిపోయిందన్న విసుగుతో ఒక దుర్ముహూర్తాన ఆ కూతురు చెట్టంత చెట్టును నరికేయించింది. అంతే కథ సమాప్తం.
ఆ చెట్టును నరికేశారన్న వార్త తెలిసిన రమేష్ బాబు తన దగ్గరున్న ఫొటోల్లో ఆ చెట్టును వెతకడం మొదలుపెట్టారు. కొన్ని వందల, వేల ఫోటోలు, దానితో ముడిపడ్డ వేన వేల సందర్భాలు దొరికాయి. ఆ వేప చెట్టుతో ఫొటోల్లో ఉన్నవారిలో కొందరు కాలం చేశారు. ఒకామె భర్త తిట్టాడన్న కోపంతో ఆత్మహత్య చేసుకుంది. ఆడుకుంటున్న పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. తలంటు పోసుకుని ఆరేసుకున్న జడలు, అంగట్లో కొనడానికి వచ్చి ఆగిన కాళ్లు, ఆడుకుంటూ వచ్చి ఆగిన పిల్లల చక్రాలు, ఎల్లమ్మగా కొలిచి కొమ్మకు పెట్టిన పసుపు బొట్లు, వెలిగించి పెట్టిన అగరుబత్తీలు…ఎన్నిటిని చూసిందో ఈ వేప చెట్టు? బతికి ఉండి ఉంటే…ఇంకా ఎన్నిటిని చూసేదో?
పాడులోకానికి కన్ను కుట్టింది. ప్రాణవాయువు ఇచ్చే చెట్టు ప్రాణాన్ని తీసేసింది. ఈ వేపకథలో గుండెను మెలిపెట్టే ఏవేవో అంశాలున్నాయి. మన పర్యావరణ అజాగ్రత్తలు ఉన్నాయి. తరం మారితే స్వరం మారడాలు ఉన్నాయి.
ఒకే ఒక చెట్టు చుట్టూ అల్లుకున్న ఇన్నేళ్ల కథను, వ్యథను కెమెరాలో బంధించడం ఒక ఎత్తు. ఆ బాధను మన చెంప మీద చెళ్లుమని కొట్టినట్లు ఇలా రెండు నెలలపాటు ప్రదర్శన పెట్టడం మరొక ఎత్తు. సామాన్యశాస్త్రంలో దాగిన అసామాన్య విషయాలను వెలికి తీసి మన ముందు పెట్టడంలో రమేష్ బాబుది దశాబ్దాల అనుభవం. దీన్ని కూడా మనం సామాన్యంగా తీసుకుంటామనే బాధతో ఒక్కొక్క ఫొటోలో ఆ వేప ఏమి చెబుతోందో రమేష్ బాబు ఓపికగా వివరిస్తున్నారు. హైదరాబాద్ ఓ యు కాలనీ సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీలో మే 31 వరకు “యాప చెట్టు” ఫోటో ప్రదర్శన. కాంటాక్ట్ నంబర్:- 9948077893. ఉచిత ప్రవేశం.
ప్రదర్శనశాలలో మూడు రూముల్లో వేప కథలు అన్నీ విన్నప్పుడు మన ఒళ్లు పత్రహరితమై పొంగుతుంది. చివర ఆ వేప మృతికి సంతాపంగా ఆ కొమ్మ కలపకు పూలు చుట్టి ఉండడం చూస్తే గుండె తరుక్కుపోతుంది.
తినగ తినగ వేప తియ్యగా ఉంటుంది.
వినగ వినగ ఈ వేప బతుకుతుంది.
అందుకు ప్రతీకాత్మకంగా సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీ బాల్కనీకి నీడనిస్తున్న పొరుగింటి వేప చెట్టు కొమ్మల చేతులు ఊపుతూ రమేష్ బాబుతో పాటు మనతో కూడా ఏదో మాట్లాడుతోంది. అది అర్థం కావాల్సినవాళ్లకు అర్థమయితే చాలు.
-పమిడికాల్వ మధుసూదన్
ఇవి కూడా చదవండి: