ఆస్ట్రేలియా-ఇండియా పురుషుల హాకీ జట్ల మధ్య నేడు జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఆసీస్ జట్టు 5-4 తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు భారత హాకీ జట్టు ఆస్ట్రేలియా లో పర్యటిస్తోంది. ఈ మ్యాచ్ లు అన్నీ అడిలైడ్ లోని మాకే స్టేడియంలోనే జరుగుతున్నాయి.
భారత ఆటగాడు ఆకాష్ దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ఓ గోల్ చేశాడు. ఆట చివరి నిమిషంలో ఆసీస్ ఆటగాడు గోవేర్స్ బెక్ పేనాల్టీ కార్నర్ ద్వారా చేసిన గోల్ తో ఆ జట్టు విజయం సొంతం చేసుకుంది.
ఆట 5వ నిమిషంలో ఫీల్డ్ గోల్ ద్వారా ఆసీస్ బోణీ కొట్టింది. 21, 41, 57 నిమిషాల్లో మరో మూడు గోల్స్ చేసింది. ఇండియా 10, 27, 31, 59 నిమిషాల్లో గోల్స్ చేసింది. ఆట డ్రా గా ముగుస్తుందన్న తరుణంలో గోవేర్స్ గోల్ సాధించి విక్టరీ అందించాడు.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 1-0ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ రేపు జరగనుంది. నవంబర్ 30; డిసెంబర్ 3,4 తేదీల్లో తదుపరి మ్యాచ్ లు ఉంటాయి. జనవరి 13, 2023 నుంచి ఓడిశాలో జరగనున్న హాకీ వరల్డ్ కప్ కు ఈ సిరీస్ ద్వారా వామప్ ఉంటుందని, అందులోనూ ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తో ఆడడం మెగా టోర్నీకి ముందు జట్టుకు ఎంతో ఉపయోగమని భారత హాకీ సమాఖ్య భావిస్తోంది.