Saturday, November 23, 2024
HomeTrending Newsగర్వంగా చెప్పుకునే పథకం ఇది: జగన్

గర్వంగా చెప్పుకునే పథకం ఇది: జగన్

We are Proud: తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కాలర్ ఎగరేసుకుని సగర్వంగా చెప్పుకునే పథకం గృహ నిర్మాణమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదలందరినీ ఇంటి యజమానులుగా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. దీనితో పాటు ప్రతి పథకం పారదర్శకతతో.. అవినీతి, వివక్షకు  తావులేకుండా అందుతోందని చెప్పారు.  ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’  పథకంపై శాసనసభ లో జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల 76 వేల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేశామని, వీటిలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టామని, అక్షరాలా 28 వేల కోట్ల రూపాయలతో ఈ పని జరుగుతోందని చెప్పారు. రెండుదశలూ పూర్తయిన తర్వాత ఒక్కో అక్కచెల్లమ్మకు 4 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి వారిచేతులో పెడుతున్నట్లు అవుతుందన్నారు.  ఇళ్ళ స్థలాల కోసం 71,811 ఎకరాల స్థలం సేకరించామని,  ఈ భూమి విలువ 25వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని వివరించారు. పేదలకు పంచిన వాటిలో 2లక్షల 62 వేల టిడ్కో ఇళ్లు కూడా ఉన్నాయన్నారు.

తాము కడుతున్నవి ఇళ్లు కాదని, ఊళ్ళని, దాదాపు 17వేల 5 కాలనీలు ఉన్నాయని, వీటిలో కొన్ని కాలనీల్లో నగర, మేజర్ పంచాయతీలకు సరిపడా జనాభా నివాసం ఉంటారన్నారు. ఈ మొత్తం కాలనీల్లో తొలిదశలో 10,067 కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం మొదలైందన్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం అధికారులు, మంత్రి రంగనాథరాజు ఎంతగానో కష్టపడుతున్నారని  ప్రశంసించారు. ఇళ్ళ నిర్మాణానికే ప్రతేకంగా జిల్లాకు ఓ జాయింట్ కలెక్టర్ ను నియమించామన్నారు.

రాష్ట్రంలో ఇళ్ళ నిర్మాణ పథకానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఎంతగానో ఉందని, ప్రధాని మోడీకి  సిఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.  తమ ఇళ్ళ నిర్మాణం మహా యజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు చంద్రబాబు, తెలుగుదేశం శాయశక్తులా కృషి చేసిందని సిఎం విమర్శించారు. విపరీతమైన దుర్భుద్ధితో ఈ కార్యక్రమం చేయనీయకుండా ఎన్నో ప్రయత్నాలు  చేశారని, చివరకు పులివెందులలో కూడా ఆటంకం కలిగించారని, విశాఖలో లక్షా 80 వేల ఇళ్ళకు సంబంధించి నిన్ననే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. కోర్టు ఉత్తర్వులు అందగానే పెద్ద ఎత్తున విశాఖలో ఈ కార్యక్రమం చేపడతామని సిఎం వివరించారు. ఇంటిని పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించి పట్టా  పేదవారికి అందించేటప్పుడు పేదల కళ్ళలో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను నడిపిస్తుందని  విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : మధ్య తరగతి వారికి సొంతిల్లు: సిఎం జగన్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్