All-out: హైదరాబాద్ లో ఈ మధ్య అందరూ కుక్కల మీద పడ్డారు గానీ, అసలు పడాల్సింది దోమల మీద… ఈ ఏడు నగరంలో దోమలు స్వైర విహారం చేశాయి. అయితే కాస్త మంచి దోమలున్నట్లాయి, డెంగ్యూ కేసులు గతంతో పోలిస్తే తక్కువే… కానీ ఈ కార్తీక మాసంలో ఒక సింగల్ దోమను పట్టుకోవడంలో ఓ డాక్టర్ గారి తిప్పలు … ఆయన అనుభవంలోనే….
గది మొత్తానికి ఒకటే దోమ. పడుకోనివ్వట్లా! ఝుమ్మంది నాదం పాటలో జయప్రదలా క్షణం నిలబడకుండా గదంతా పరుగెత్తేస్తోంది. దానివెనకాల డప్పు పట్టుకున్న చంద్రమోహన్‌లా నేనూ! దాన్నెలాగైనా ఏసెయ్యాలని నిర్ణయించుకున్నాను. కానీ దొరకట్లేదు.
భలే ఉత్సాహంగా ఎగురుతోంది. మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తిలాంటి వాళ్ల ఉడుకురక్తాలే తాగుతుందనుకుంటా, ఓ… ఎగిరెగిరి పడిపోతోంది.
గుడ్‌నైట్ సీసాలో లిక్విడ్ అయిపోయి సరిగ్గా ఇవాళ్టికి నెలతప్పింది. సాయంత్రం పూట ఆఫీసు నుండి రాగానే తనేం చేస్తుందో తెలుసా? సోఫాలో మహరాణిలా కూర్చుని వీధి చివరున్న డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కి ఫోన్ చేసి లలితా బ్రాండ్ బియ్యం, కవితా బ్రాండ్ ఇంగువా పంపించండంటూ తెగ చెప్తూ ఉంటుంది.
కానీ గుడ్‌నైట్ అయిపోయిందని మాత్రం గుర్తుండదు. ఆ స్టోరు కుర్రాళ్లందరూ రాత్రి పదకొండింటికి తాళాలేసేసి, ఇళ్లకెళిపోడానికని సైకిళ్లెక్కుతుండగా గుర్తొస్తుంది! ఈలోగా మా జయప్రద కాళ్లకి గజ్జెలవీ కట్టుకుని రెడీ అయిపోతుంది. చిన్నతనంలో ఎప్పుడైనా ఏ చుట్టాలో పోయి ఏ మైలో వచ్చి మూడురోజుల పక్షిణీ పట్టిన తరవాత స్నానం చేసేసి, కనీసం బట్టలైనా మార్చుకోకుండా ఆ తడి తువ్వాళ్లు కట్టుకునే గబగబా ఇంట్లోకెళ్లి అన్ని వస్తువులూ ముట్టేసుకుంటూ పరుగెత్తే ఆట ఆడుకునేవాళ్లం పిల్లలందరం.
ఈ దోమ రోడ్ మ్యాప్ అచ్చం అలానే ఉంది. దీన్దుంపతెగా, ఓ దిశా దశా లేకుండా మొత్తం అన్నింటి మీదా వాలుతోంది.
ఆమధ్య బెంగుళూరు ఇస్కాన్ గుడికెళ్లినపుడు తను వద్దంటున్నా ఎంతో ఇష్టపడి కొన్న పాలరాతి మీరాబాయి బొమ్మ ముక్కుమీద వాలింది. దానిమీదకి ఇప్పుడేమన్నా విసిరితే మీరా కాస్తా శూర్పణఖ అయిపోతుంది.
అక్కణ్ణుంచి ఎగిరెళ్లి కృష్ణుడి విగ్రహం మొత్తం వదిలేసి పిల్లనగ్రోవి చివర్నవాలి నన్ను చూసి అచ్చం కాళీయమర్దనం చేస్తున్న కృష్ణుడిలా నవ్వింది. ఆ సూక్ష్మజీవి నాకేదో సూక్ష్మం బోధిస్తున్నట్లనిపించింది.
ఇలాక్కాదని హాల్లోకొచ్చా. టీవీ కింద డెస్క్‌లు తెరిచిచూశాను. కార్గో వ్యానుల్లా కిక్కిరిసి ఉన్నాయి డెస్కులన్నీ.
మొత్తానికి కావలసిన వస్తువు దొరికింది. చైనా వాళ్ల అగరొత్తులు. ఇవి దోమల్ని తరుముతాయని ఫేస్‌బుక్‌లో ఎవరో చెబితే కొన్నాను. బానే పన్జేస్తున్నాయి.
అగ్గిపెట్టె కోసం ఇల్లంతా వెదికాను.
గ్యాస్ స్టవ్ ఎప్పుడూ లైటర్‌తోనేగా వెలిగించేది? అంచేత వంటగదిలో లేదు.
క్యాండిల్ లైట్ డిన్నర్లవీ చేసే రొమాంటిక్ వయసు దాటిపోయి, రుమాటిక్ వయసు వచ్చేసింది కాబట్టి భోజనాల బల్ల దగ్గరా లేదు.
మాయిద్దరి మధ్యా పచ్చగడ్డేస్తే భగ్గుమనే అవకాశం ఉన్నందున ఎందుకైనా (మంచిదని)చెడ్డదని పడగ్గదిలో ఉంచుకోం.
ఇహ ఏ బాత్రూములోనో ఫినాల్ సీసా వెనకాల దాచుకుందామంటే పాత సినిమాల్లోలా ఎస్. వరలక్ష్మికి భయపడి రహస్యంగా బాత్రూములో సిగరెట్లు కాల్చే గుమ్మడిలాంటి భర్తని కాను. మరెక్కడ వెదకాలి?
ఆఁ, పూజగది!
‘ఆగండి. మీరిందాకా బాత్రూముకి వెళ్లొచ్చారుగా? ఆ బట్టలతోనే దేవుడిగదిలోకి వెళిపోతారా? హవ్వ! రాన్రానూ మీ దాష్టీకాలకి అంతులేకండా పోతోంది!’ అంటూ రూఫ్ స్పీకర్లలోంచి వినబడింది. ఇపుడెలా? అనుకుంటుండగా వెంటనే ఇది కార్తీకమాసం కదా అని గ్యాపకవొఁచ్చింది.
‘శివులవారు ఇటువంటి ధూళినీ, మలినాలనూ ఖాతరు చెయ్యరు. కాశీలోను, శ్రీశైలంలోనూ ధూళిదర్శనాలవీ ఎన్నిమార్లు చేసుకోలేదూ? వారైతే ఏకంగా అంతంత బూడిద ఒత్తుగా పూసేసుకుంటారు. ఆ స్ఫూర్తితోనేగా నేను రోజూ అంత పౌడరదీ రాస్తుంటా?’ అనుకుని శివశివా అనుకుంటూ నాలుగ్గుంజీలు, అరడజను లెంపలూ కానిచ్చి దేవుడిగదిలో అడుగెట్టాను.
ఆ పరమేష్టి చల్లగా చూడ్డంవల్ల ఎదురుగా ఒక గులాప్పువ్వు అగ్గిపెట్టె ప్రత్యక్షమయింది. రెండుచేతులా తీసుకుని, రెండుకళ్లకీ అద్దుకుని, తలుపు శబ్దంకాకుండా చేరేసేసి బయటపడ్డాను. నిద్రపోతున్న దేవుళ్లందరూ మందహాసంతో పక్కకి ఒత్తిగిల్లారు.
ఓ రెండు అగరొత్తులు వెలిగించి గదిలోకొచ్చి ఫ్యాన్ ఆపేశాను. వెంటనే మెలకువొచ్చి తను కళ్లు తెరిచింది.
‘ఏంచేస్తున్నావు పడుకోకుండా?’ అంది తన కళ్లు మరింత చిన్నవిగా చేసి మహేష్‌బాబులా చూస్తూ.
‘దోమొకటి ఏడిపిస్తోంది బన్నీ…!’ ఇంకా ఏదో చెప్పబోతుండగానే ‘గుడ్‌నైట్!’ అనేసి మళ్లీ పడుకుండిపోయింది. మెలకువగా ఉన్నప్పుడు గుర్తుండదుగానీ నిద్రలో మాత్రం ‘గుడ్‌నైట్’ట!
నీ…!
శోభనం గదిలో అలుముకున్నట్టు కాసేపటికి గదంతా పొగ వ్యాపించేసింది.
ఎక్కడుందీ నాట్యగత్తె? అని వెదకడం మొదలెట్టాను.
డ్రెస్సింగ్ టేబుల్ మీద పౌడర్ డబ్బాల ముందు క్షతగాత్రిలా పడి కనబడింది. పెంటథాల్ ఇచ్చినట్టు పడుకుందే తప్ప స్కొలీన్ ఇచ్చినట్టు సొమ్మసిల్లిపోలేదు. కాసేపటికి ఈ పొగంతా ఆవిరైపోగానే దీనికి మెలకువొస్తుంది.
పాపం, దాన్నెందుకో చంపాలనిపించలేదు.
డిటెక్టివ్ యుగంధర్ ప్రత్యర్ధి మెడమీద అతి లాఘవంగా ఓ దెబ్బ కొడుతుంటాడు తన నవలల్లో. తన అసిస్టెంటు రాజుతో చెబుతాడు మళ్లీ… ‘ఇతనికి ఓ రెండు గంటలవరకూ స్పృహ రాదు..!’ అని!
చిన్నప్పుడు చదివి భలే ఆశ్చర్యపోయేవాణ్ణి, అంత కచ్చితంగా ఎలా కొడతాడబ్బా యుగంధరంటూ!
అచ్చం అలానే మా డాన్సింగ్ స్టార్ మళ్లీ కాసేపటికే లేచి రెక్కలు విదిలించి, పక్కనే ఉన్న పౌడర్ కాస్త రాసుకుని, దువ్వెన్నతో మీసాలు సవరించుకుని ‘ఝాఁయ్’ అంటూ బయల్దేరింది!
నేనేమో దానిమీద జాలిపడ్డానా? అదేమో జాలీగా గదంతా తిరగడం మొదలెట్టింది మళ్లీ!
ఇంకేం నిద్ర? లేచి రాసుకుంటూ కూచున్నా!
…….కొచ్చెర్లకోట జగదీశ్