రాబోయే ఎన్నికల్లోనే కాదు… ఆ తరువాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న బీఆర్ఎస్ తో పొత్తు ఎలా సాధ్యమని, ఆ ఆలోచనకే తావు లేదని ఉద్ఘాటించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా… లేదా ఎంపీగా పోటీ చేయాలా? అనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు.
అమెరికాలో పర్యటిస్తున్న బండి సంజయ్ కుమార్ నార్త్ కరోలినా లోని చార్లోటే లోని హిందూ సెంటర్ లో ‘‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, సోషల్ మీడియా మాజీ కన్వీనర్ వెంకటరమణ,OFBJP Team సభ్యులు అరవింద్ మోదిని, ఆనంద్ జైన్, శ్రీకుమార్ వేల్పుల,శ్యాం సుందర్ పడమటి, సుభాష్, దిలీప్ రెడ్డి, నీఖేత్ సాయిని తదితరులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ ప్రసంగించారు. ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముఖ్యాంశాలు….
కుటుంబ పాలనలో ఉన్నప్పుడు దేశం అన్ని రంగాల్లో దిగజారింది…. ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్టు అప్పటి పాలకులు వ్యవహరించే వారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. కనీసం అవినీతి ఆరోపణలు చేసే సాహసం కూడా చేయలేని పరిస్థితి… వ్యవస్థలో జవాబుదారీతనం…. పారదర్శకత…. 140 కోట్ల భారతీయులే తన కుటుంబంగా భావించి సెలవు తీసుకోకుండా…. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న నాయకుడు మోదీ. ఆర్ధిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి తీసుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారత్ ను తీర్చిదిద్దబోతున్నారు.